14 April, 2026 | 10:13 PM

కరీంనగర్ లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

14-04-2026 06:40 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో మంగళవారం రోజు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. మొదటగా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పాలకవర్గ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తీగలగుట్టపల్లి అంబేడ్కర్ కాలనీలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

చింతకుంటలో కెనాల్ సమీపంలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్ గృహకల్పకాలనీలో జయంతి సందర్భంగా స్థానిక కార్పోరేటర్ గడ్డి ప్రదీప్ తో కలిసి అంబేడ్కర్ విగ్రహాం ఆవిష్కరించారు.  కరీంనగర్ లోని ఎంపి క్యాంపు కార్యాలయంలో  బీజేపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ పార్టీ పాలకవర్గ సభ్యులు తదితరులు అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

నరగంలోని కోర్టు చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135 వ జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగాయి. అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధికారికంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, సీపి గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ లోకల్ బాడి అశ్వినీ తానాజి వాకేడే, పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి,చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ నగర్ లో  వేడుకులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించి ,అనంతరం తన చేతుల మీదుగా  అన్నదానం చేశారు.  ​ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... రాజ్యంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని దేశంలో అన్ని వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. భారతదేశ గడ్డ పై బాబా సాహెబ్ అంబేడ్కర్ జన్మించడం యావత్ భారతానికి గర్వకారణం అన్నారు.

ఆయన రచించిన రాజ్యాంగం వలనే నేడు మనందరికి సమాన హక్కులు లబిస్తున్నాయన్నారు. దేశం ఇంత పటిష్ఠంగా ఉండి ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయంటే కేవలం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ వల్లనే అన్నారు. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశాయాలను, ఆలోచనా విధానాలను స్పూర్తగా తీసికొని... ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందింస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా మహనీయలందరి జయంతి, వర్థంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అధికారులు, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.