16-08-2025 12:22:43 AM
మేనేజింగ్ పార్టనర్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): జీఎస్టీ మోసం కేసులో అంబికా స్టీల్ మేనేజింగ్ పార్టనర్‌ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాష్ట్ర జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, గోవాకు పారిపోయేందుకు ప్ర యత్నిస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నా రు.
అంబికా స్టీల్ సంస్థ.. ఎలాంటి సరుకుల రవాణా చేయకుండా కేవలం కాగితాలపై మాత్రమే లావాదేవీలు జరిగినట్లు చూపించింది. దీనికోసం నకిలీ ఇన్వాయిసులు, ఈ-వే బిల్లులను సృష్టించి వాటి ఆధారంగా జీఎస్టీ కింద చెల్లించాల్సిన పన్నులో రాయితీ అయిన ఇన్‌పుట్‌ట్యాక్స్ క్రెడిట్‌ను అక్రమంగా పొందింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర జీఎస్టీ అధికారులు దృష్టి సారించి, లోతుగా దర్యాప్తు చేయగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది జూన్ నుంచి అధికారుల అదుపులో ఉన్న వాహనంలోనే పలువురు పన్ను చెల్లింపుదారులు సరుకులు రవాణా చేసినట్లుగా వందల సంఖ్యలో ఈ-వే బిల్లులను సృష్టించినట్లు తేలింది. ఈ కీలక ఆధారంతో రాష్ట్ర జీఎస్టీ అధికారులు ఈ ఏడాది జూలై 30న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారం భించారు. నిందితులు తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
వారి వాదనలను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం, పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఉచ్చు బిగుస్తోందని గ్రహించిన నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గోవాకు పారిపోవాలని పథకం వేశారు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు పక్కా ప్రణాళికతో వారిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.