16-09-2025 07:14:07 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని కర్తవ్యంగా తీసుకుని సమాజంలో పేద ప్రజలకు అండగా నిలవాలని ఆశయంతో ఏర్పడిన అమ్మ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. అమ్మ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పల్లెర్ల చంద్రశేఖర్, తేలుకుంట్ల రజనీకాంత్ మాట్లాడుతూ... 2009లో సమాజంలో పది మందికి మంచి చేయాలనే సంకల్పంతో కొంతమంది స్నేహితులు యెలుగూరి నగేష్ కుమార్, పాబోలు మణికిరణ్, నరేంద్రుల అభిలాష్, అనంతుల రాంబాబు, వనం కృష్ణమోహన్, కలవల ప్రవీణ్, సముద్రాల రత్నాకర్, గౌరిశెట్టి నగేష్, దివ్వెల రమేష్ తదితర యువకులతో కలిసి అమ్మ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించామన్నారు.
అప్పటి నుంచి విద్యార్థులకు పుస్తకాలు, ల్యాప్టాప్‌లు, కాలేజీ ఫీజులు, పేదవారికి వైద్య సహాయం అందిస్తూ సంస్థ కొనసాగు తుందన్నారు. ఇటీవల ఇల్లందులోని స్టేషన్ బస్తీ ప్రాంతానికి చెందిన తల్లాడ మాధురి గొంతు ఇన్ఫెక్షన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఆమె భర్త నాగేశ్వరరావు అతి తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నందున వైద్య ఖర్చులు భరించడం కష్టమైంది. ఈ పరిస్థితిని గమనించిన అమ్మ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి మాధురి వైద్య చికిత్స కోసం రూ.10వేల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఇప్పటికే అనేక పేద కుటుంబాలకు అండగా నిలిచిన ట్రస్ట్ స్థానిక ప్రజల అభిమానాన్ని, ఆశీర్వాదాలను పొందుతుందన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ట్రస్ట్ సభ్యులు సంకల్పించాలని అన్నారు. అదేవిధంగా పేద కుటుంబానికి చెందిన మాధురికి మెరుగైన వైద్యం అందించేందుకు ఇతర దాతలు కూడా సహాయం చేయాలని ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మరి కొంతమంది దాతలు ఆర్యవైశ్య మహాసభ మండల, పట్టణ అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ, సంఘం సభ్యులు అమర్ గుప్తా, యెలుగూరి సతీష్, సంకా సత్య నాగేంద్ర శ్యామ్, నూనె వీరభద్రం తదితరులు ఆర్థిక సాయం అందించారు.