28-01-2026 12:00:00 AM
తెలంగాణలో ఆనాడే సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులు ప్రసరించారు ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు సోదరుల్లో పెద్దవాడు ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, చిన్నవాడు ఒద్దిరాజు రాఘవ రంగారావు. ఒద్దిరాజు సోదరులు బహుభాషా కోవిదులు. వీరి స్వగ్రామం వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి. సోదరుల మధ్య ఏడున్నర సంవత్సరాల వ్యత్యాసం. తండ్రి వెంకట రామారావు, తల్లి రంగనాయకమ్మ. ఆమె సంస్కృతాంధ్ర భాషలలో పండితురాలు.
1887 ఏప్రిల్ 2న ఒద్దిరాజు సీతారామచంద్ర రావు జన్మించారు. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం, ఉర్దూ, పార్శి, హిందీ, ఇంగ్లీష్ వంటి అష్టభాషల్లో ప్రవీణులైన ఒద్దిరాజు సోదరులు ప్రబంధాలు, కావ్యాలు, నవలలు, నాటికలు, ప్రసహనాలు, శతకాలుగా దాదాపు 75 గ్రంథాలకు పైగా రచనలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి ఒద్దిరాజు సోదరుల ‘తెనుగు పత్రిక’ ఎనలేని కృషి చేసింది. 1922లో ఇనుగుర్తిలో తమ ఇంటి నుంచే తెనుగు పత్రికను ప్రారంభించారు.
ఒద్దిరాజు సీతారామచంద్ర రావుగారు సంపాదకులుగా అక్షరాలను సమకూర్చడం, ప్రూఫులు దిద్దుకోవడం, వార్తలు సేకరించడం, వ్యాసరచనలు చేయడం, పత్రికను బట్వాడా చేయ డం వంటివి సొంతంగా చేసుకునేవారు. రుద్రమదేవి, శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసం, స్త్రీ సాహసం, ముక్తలవ; నౌకా భంగం (రవీంద్రుని ‘రెక్’ నవలకు అనువాదం) సీతారామచంద్రరావు రాసిన నవలల్లో మచ్చుకు కొన్ని. ఇక మోహినీ విలాసం, ప్రేమ వివాహం, శశవిశాణము ఆయన రచనల్లో నాటకాలు. ఇతర అంశాలపై రాసిన పుస్తకాలు అనేకంగా ఉన్నాయి. సంస్కృత రచనల్లో కృష్ణ స్థవ, శ్రీ స్థవ, శుకపక్షీయం, ఉత్సవానంద భాణమ్, వైభవ స్తవ: విభక్త్యర్థం, ధాతు లాంటి నిఘంటువులున్నాయి. పాణిని అష్టాధ్యాయి (వ్యాకరణ సూత్రములు), సిద్ధాంత కౌముదీ అనువాదము, ఆంగ్ల వ్యాకరణము (ది మాన్యువల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్‌కు అనువాదం) ఇత్యాదివి శాస్త్ర గ్రంథాలు. పలు ఆంగ్ల రచనలు కూడా చేశారు.
సూర్యాపేట జిల్లా చందుపట్లకు చెందిన లక్ష్మీనరసింహరావు, రంగనాయకమ్మల కుమార్తె నప్పినమ్మతో ఒద్దిరాజు సీతారామచంద్ర రావుకు వివాహం జరిగింది. ఈ దంపతులకు డాక్టర్ వెంకట నరసింహారావు సంతానం. 1955లో సీతారామచంద్రరావుకు గొంతు క్యాన్సర్ సోకింది. అంత బాధలోనూ ఆయన తన రచనా వ్యాసంగానికి విరామం ఇవ్వలేదు. చివరి ఘడియల్లో ఆసుపత్రిలో ఉన్న ఒద్దిరాజు తన చివరి రచనగా ‘సౌదామిని పరిణయం’ కావ్యాన్ని పూర్తి చేశారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు 28 జనవరి 1956లో తన 68 ఏట కీర్తిశేషులయ్యారు. కాగా సీతారామచంద్ర రావు ప్రభంద కావ్యం ‘సౌదామిని పరిణయం’ కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగం వారు 1988లో పాఠ్యాంశంగా ముద్రించారు. అంతేకాదు ఒద్దిరాజు సీతారామచంద్ర రావు గారి నవలలైన రుద్రమదేవి, మగ సంసారం, నీవేనా.. అనేవి డిగ్రీ, ఇంటర్, పదవ తరగతి సిలబస్‌లలోనూ పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది.