calender_icon.png 30 January, 2026 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ టూల్స్‌తో జాగ్రత్త!

28-01-2026 12:00:00 AM

సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతుండడంతో ప్రపంచం రోజురోజుకు వేగంగా మారిపోతున్నది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) మన అందరి జీవితాల్లో నిత్యకృత్యమైపోయింది. సమాచార వ్యాప్తి, కంటెంట్ రూపొందించడం, డిజిటల్ ఇంటరాక్షన్ కోసం చాలా మంది వీటిని వాడుతున్నారు. ఈ తరహా సేవలు అందిస్తున్న ఏఐ టూల్స్‌లో చాట్ జీపీటీ, గ్రోక్, పర్‌ప్లెక్సిటీ, డీప్ సీక్ తదితర టూల్స్ ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇలాంటి ఏఐ టూ ల్స్‌ను మంచికి ఉపయోగించినంత వరకు సమస్య వాటిల్లదు.

కానీ పరిమితికి మించి ఏఐ టూల్స్‌ను ఉపయోగించినప్పుడే సమస్య ఉత్పన్నమ వుతుంది. ఈ మధ్య కాలంలో ఏఐ టూల్స్ వల్ల కలుగుతున్న నష్టాలు అసామాన్యంగా ఉంటున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఏఐ టూల్ గ్రోక్ చర్య వివాదాస్పదంగా మారింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాల్దీవుల నుంచి వచ్చిన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ఇచ్చిన రిప్లు పోస్టుకు సంబంధించిన అర్థాన్నే గ్రోక్ మార్చేసింది. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మోదీ ధన్యవాదాలు చెబుతూ ఇరు దేశాల్లోని ప్రజా ప్రయోజనం కోసం కలిసి పనిచేస్తామని ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు.

కానీ గ్రోక్ టూల్ మోదీ సందేశాన్ని పూర్తిగా మార్చేసింది. గణతంత్ర దినోత్సవ పదం స్థానంలో స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొన్న గ్రోక్ ‘మాల్దీవుల్లో 77వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాల్దీవుల ప్రభుత్వం పాల్గొంది. కానీ ఇదే మాల్దీవులు గతంలో భారత వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంది’ అని అనువదించింది. గతంలోనూ ఇదే గ్రోక్ టూల్‌పై ఆరోపణలు వచ్చాయి. మహిళలు, చిన్నారుల అసభ్య చిత్రాలను గ్రోక్ సృష్టిస్తుందంటూ భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆరోపించాయి. ఏఐ టూల్స్ అత్యంత ప్రమాదకరమని, వాటి ఉపయోగంలో అప్రమత్తత అవసరమని భారత ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లోనే పేర్కొంది.

ఏఐ, చాట్ జీపీటీలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా వినియోగిస్తున్నారని, దీనివల్ల దేశానికి సంబంధించిన కీలక సమాచారమంతా బయటకు వెళుతుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. ఏఐ టూల్స్ ద్వారా మన దేశంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న పనులు, ఇతర కీలకమైన సమాచారమంతా పక్క దేశాలకు చేరవేస్తున్నట్లవుతుంది. నిజానికి ఏఐ టూల్స్ ఫీచర్లన్నీ ప్రయోగదశలోనే ఉన్నాయి.

పూర్తి సామర్థ్యం లేని ఏఐ టూల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించినప్పటికీ, వాటికొచ్చే కమాండ్ ప్రాంప్ట్ ఆధారంగానే విషయాన్ని వెల్లడిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రారంభ దశలోనే ఉన్న ఏఐ టూల్స్‌ను సామాజిక మాధ్యమం ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురాకపోవడమే ఉత్తమం. అయితే ఏఐ టూల్స్‌పైనే మొత్తం నెపం వేయడం సరికాదు. ఒక వినియోగదారుడు ఏఐ టూల్స్‌కు అశ్లీల, అసభ్య, తప్పుడు కంటెంట్‌ను ఇన్‌పుట్‌గా ఇస్తే, దానికి తగ్గట్లే ఔట్‌పుట్ వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం వేసే ప్రశ్నలకు ఏఐ టూల్స్ సమాచారమిస్తున్నప్పటికీ, వాస్తవాలను బహిర్గతం చేయడంలో అప్పుడప్పుడు విఫలమవుతుండ డంతో వాటితో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం.