11-10-2025 12:48:14 AM
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10: సద్దుల బతుకమ్మ పండుగ ముగిసి 10 రోజులు గడుస్తున్నా, కొన్ని ప్రాంతాల్లో నీటి తొట్లలో నిమర్జనం చేసిన బతుకమ్మలను తీయకపోవడంతో పూలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో వెలుగు చూసింది. తీరొక్క పూలతో పేర్చి మహిళలలు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించి, అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
కొన్ని ప్రాంతాల్లో కొందరు గ్రామ శివారులో గల చెరువులు, కుంటలలో నిమజ్జనం చేయగా, మరి కొందరు గ్రామంలో మూగ జీవాల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్లలో వేశారు. కాగా గ్రామంలోకి దీని పక్కనుండే ప్రధాన దారి ఉండడంతో గ్రామస్తులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అటుగా వెళుతున్న క్రమంలో పాదచారులకు, వాహనదారులకు దుర్వాసనతో ఇబ్బందిగా మారింది. కావున ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.