13-12-2025 01:56:02 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
అమీన్ పూర్, డిసెంబర్ 12 :అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ప్రతిపాదించిన ఎస్టిపి ప్లాంటును ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నెంబర్ పరిధిలో ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు కోసం నిర్దేశించిన స్థలాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వ్యయంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నంబర్ పరిధిలోని 10 ఎకరాలలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి గతంలో ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలిపారు.
ఇదే సర్వే నెంబర్ లో 5 ఎకరాలు స్టేడియానికి, పది ఎకరాలు నవోదయ విద్యాలయానికి సైతం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎస్టీపీ ప్లాంట్ ను స్టేడియానికి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారని.. దీని మూలంగా స్థానిక కాలనీల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు తనకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
స్టేడియానికి కేటాయించిన స్థలంలో కాకుండా కాలనీలకు దూరంగా కేటాయించిన పది ఎకరాలలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, తహసీల్దార్ వెంకటేష్, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఉపేందర్ రెడ్డి, గోపాల్, యూనుస్, రాములు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.