13-12-2025 01:43:39 AM
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ముగిసిన మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండా, వరంగల్ జిల్లా బండవుతాపురం గ్రా మాల్లో కొత్త ‘పంచాయతీ’ మొదలైంది. సోమ్లా తండాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ సోదరుడి భార్య భూక్య కౌసల్య పోటీపడ్డారు. అయితే ఆమె రెబల్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైంది.
ఈ క్రమంలో శుక్రవారం తాను ఓట్ల కోసం ఓటర్లకు ఒక్కొక్కరికి చెల్లించిన 1500 రూపాయలను తిరిగి వసూలు చేసుకోవడానికి ఆమె, భర్త కొడుకు రంగంలోకి దిగి ఇంటింటికి తిరుగుతూ మీరు నాకు ఓట్లు వేయలేదు.. అందుకే ఓడిపోయాను.. ఓటేసినట్లు ఊరికే చెబితే నమ్మేది లేదు దేవుడి జెండాపై ప్రమాణం చేయాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తండావాసులు ఆందోళనకు దిగారు.మిమ్మల్ని డబ్బులు ఎవ్వరూ ఇవ్వమని అడిగారు..
మీరే మా కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటుకు 1500 రూపాయలు చొప్పున ఇచ్చి ఇప్పుడు ఓడిపోతే దౌర్జన్యానికి దిగి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవడానికి మాతో ఒట్లు వేయిస్తారా అంటూ తండావాసులు నిరసనకు దిగారు. దీనితో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తండావాసులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు తెలియడంతో పోలీసులు తండాకు చేరుకొని పరిస్థితిని అదు పులోకి తెచ్చారు. ఇదే తరహా సంఘటన వరంగల్ జిల్లా బండవుతాపురం లో కూడా చోటుచేసుకుంది.