01-08-2025 10:04:47 PM
మంగపేట (విజయక్రాంతి): మండలంలోని రాజుపేటలో రామచంద్రునిపేట మల్లూరు సర్కిల్ కు చెందిన 100 మంది అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్(CITU District Secretary Ratnam Rajender) అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే సమ్మక్క పిలుపునిచ్చారు. అంగన్వాడి టీచర్లు ఆయాలు సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి కే సమ్మక్క సమక్షంలో సీఐటీయూలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని వారు అన్నారు.
గతంలో అంగన్వాడీలు సిఐటియు నాయకత్వంలో అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ఇప్పుడున్న కొన్ని సౌకర్యాలు సాధించడం జరిగిందని అన్నారు. పీఎం శ్రీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ స్కూల్ ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చెప్పిందని అంగన్వాడి సెంటర్లలో ప్రీస్కూల్ దీనివల్ల ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకులు సరిత, భాగ్యలక్ష్మి, లక్ష్మీనరసింహ,మల్లికార్జున, ప్రభావతి, రమ, వెంకట నరసమ్మ, తార, వాణిశ్రీ, నాగలక్ష్మి, వెంకాయమ్మ, ఆదిలక్ష్మి, వజ్ర, శశి, విజయలక్ష్మి భాగ్య తదితరులు పాల్గొన్నారు.