25-10-2025 12:52:47 AM
-కురిసిన వర్షం, తడిచిన ధాన్యం
-కోత కోయని వరి పంటలకు భారీగా నష్టం
-తడిచిన ధాన్యంతో రైతుల బెంబేలు
బాన్సువాడ, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): రైతన్నలపై దెబ్బ మీద దెబ్బ పడింది. ఆరుగాలం కష్టించి పండించుకున్న పంటను ఆరబోసుకుందామంటే వరుణుడు ఆగ్రయించాడు. వాతావరణ మార్పుల వల్ల కురిసిన వర్షాలకు రోడ్లపై ఆర పోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కోత కోయని వరి పంట నేలవైపులు చూస్తోంది. పెట్టుబడి పెట్టి, నిత్యం పంటనే జీవనాధారంగా భావించిన రైతన్నకు నష్టమే ఏర్పడింది. వచ్చిన దిగుబడులను ఆరబోసుకొని అమ్ముకుందామంటే వర్షం దెబ్బ కొట్టింది.
ఆరబోసుకున్న దాని వర్షం నీటితో తడిసిపోయి మొలకెత్తగా, కోతుకో లేని వరి పంటలు వర్షం దాటికి నేల చూపులు చూస్తున్నాయి. వర్షం ప్రభావంగా ఉమ్మడి నిజాంబాద్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దీపావళి రోజు కురిసిన వర్షాలకు అంతటా పండుగ సంబరాలు జరుపుకుంటుంటే, అన్నదాతలు మాత్రం లబో దిబో అంటున్నారు. కాపాడుకున్న వరి ధాన్యాన్ని ఆరబోసుకొని అమ్ముకుందామంటే అకాల వర్షాలు తమను నిండా ముంచాయని రైతులు వాపోతున్నారు. కోత కోసిన వరి ధాన్యాన్ని రోడ్ల కి ఇరువైపులా ఆరబెట్టినప్పటికీ అకస్మాత్తుగా కురిసిన వర్షాలు కర్షకులను కంట నీరు పెట్టించాయి.
ధాన్యపు ఏర్పాటు ఎప్పుడు...?
అక్టోబర్ మాసంలో కోత కోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుని ధాన్యపు కొనుగోలు కేంద్రాలకు సిద్ధమవుతున్న రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఎంత మాత్రం పట్టింపు లేదని రైతుల ఆరోపిస్తున్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినట్లయితే వచ్చిన దిగుబడులకు అందే పైకం సరిపోతుందని ఆలోచనలో రైతులు ఉన్నారు. కానీ సర్కారు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రెడీ అవుతున్న తరుణంలోనే అకాల వర్షాలు రైతులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టి స్థితికి తీసుకొచ్చాయి. చాలా చోట్ల వరి పంటను కోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు కోసిన వరి పంటను వానలు తడిసి ముద్ద చేయగా, కోయని పంటపై కురిసిన వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల లక్ష్యము కాని రైతులు మాత్రం నిండా మనుగుతున్నారు.