25-10-2025 02:45:08 PM
ఆర్థిక లావాదేవీలే కారణమా....!.
హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారి యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో(University PG College for Women, Subedari) మహిళా ప్రిన్సిపాల్, మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్ (మాజీ ప్రిన్సిపాల్) శుక్రవారం ఘర్షణ జరిగి నట్లు సమాచారం.కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య నెలకొన్న కోల్డ్ వార్ చివరికి కొట్టుకునే వరకు వెళ్లినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం. ప్రొఫెసర్. బి.యస్.ఎల్ సౌజన్య గతంలో2021నుండి 2024 వరకు మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. గత వీసీ రమేష్ హయాంలో ప్రొఫెసర్ సౌజన్యను అడిషనల్ కంట్రోలర్ గా బదిలీ చేసి ఆమె స్థానంలో కంప్యూటర్ సైన్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ డాక్టర్ మధుశ్రీని ప్రిన్సిపాల్ గా నియమించారు.
ఆమె ఏడాది పదవీకాలం ముగియగానే మధుశ్రీని తొలగించి ప్రొఫెసర్ సౌజన్యను ప్రస్తుత వీసీ ప్రతాప్ రెడ్డి మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ గా మళ్లీ నియమించారు. డాక్టర్ మధుశ్రీ అదే పీజీ కాలేజీలో ఫ్యాకల్టీగా కొనసా గుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన ఏడాది పాలనలో చేసిన ఖర్చులు, పెట్టుకున్న బిల్లులు, అలుమినీ పేరిట వసూలు చేసిన డబ్బుల ఖర్చుల విషయంలో ప్రస్తుత ప్రిన్సిపాల్ సౌజన్య అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్ గా వచ్చావా? లేదా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చావా అంటూ మధుశ్రీ ఆమెను ఒకసారి నిలదీసినట్లు సమాచారం.ఇలా ఇరువురి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఈ క్రమంలోనే డాక్టర్ మధు శ్రీ కి ల్యాబ్ ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వు
లను క్లర్క్ ద్వారా, అటెండర్ ద్వారా పంపినప్పటికీ ఆమె తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ప్రిన్సిపాలే స్వయంగా మధుశ్రీ బ్యాగుపై తీసు కెళ్లి పెట్టగా ఆమె ఆర్డర్ కాపీని ఉండలా చుట్టి తన మీదికి విసిరిందని, రాయలేని రీతిలో అసభ్య పదజాలం వాడుతూ దాడికి యత్నించిందని ప్రిన్సిపాల్ ఆరోపణ. ఆమె మాటలను రికార్డు చేద్దామని ఫోన్ తీసేలోపే బయటికి వెళ్లి బాల్కనీలో నిల్చుని తనను దూషించి నట్లు సమాచారం. దీంతో ప్రిన్సిపాల్ ఆమె దగ్గరికి వెళ్లి బయటికి వెళ్లి ఎందుకు అరుస్తున్నావ్ లోపలికి రా అంటూ చేయి పట్టుకుని లాగగా ఆమె చేతి గాజు పగి లినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది.