25-10-2025 02:56:51 PM
రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలను రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
17 శాతం తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించి, రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని రిజిస్టర్ లను పరిశీలించి, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రేడ్ - ఏ రకానికి రూ. 2,389, కామన్ రకానికి రూ. 2,369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ.500 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆర్డీఓ లు, తహశీల్దార్లు తప్పనిసరిగా తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. సందర్శనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాష్, తహశీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మెప్మా ఏఓ మీర్జా ఫసాహత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు