25-10-2025 02:50:22 PM
రక్తదానం ద్వారా ప్రాణదాతలు అవుతారు
పెద్దపల్లి డిసిపి కరుణాకర్
సుల్తానాబాద్, (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేయడం ద్వారా ప్రాణదాతలు అవుతారని పెద్దపల్లి డిసిపి కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కు అపూర్వ స్పందన లభించింది, ఈ శిబిరంలో కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్, పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది తోపాటు యువత పాల్గొని పెద్ద ఎత్తున రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ అనేక సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తాన్ని దానం చేస్తే ఆపద సమయంలో ఆదుకొని మరొకరి ప్రాణం కాపాడిన వారు అవుతారని అన్నారు.
యువత సన్మార్గంలో ప్రయాణించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ఏలాంటి ప్రమాదాలు సంభవించవని, పోలీసులు ప్రజల కోసమే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని, పోలీసులకు ప్రజలకు మధ్య సత్ప్రవర్తన కలిగి ఉండాలని తద్వారా సమాజం శాంతి మార్గంలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో అనేకమంది పోలీసులు అమరులయ్యారని వారి స్మారకార్థం వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం మృతి చెందిన పోలీస్ అమరవీరుల కు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ, పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐ లు సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డి, వేణుగోపాల్ , రమేష్, సన్నత్ కుమార్, మధుకర్, రెడ్ క్రాస్ పెద్దపెల్లి జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ కావేటి రాజుగోపాల్, లయన్స్ క్లబ్ ప్రతినిధి వలస నీలయ్య, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ తోపాటు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల సిబ్బందితో పాటు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు, రక్తదానం చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు....