25-10-2025 02:42:22 PM
తొలివిడతలో 20 రోడ్లను మంజూరు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: రవాణా వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy ) స్పష్టం చేశారు. శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యామ్ రోడ్ల అభివృద్ధిలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో తొలి విడతగా 20 రోడ్లపనులను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ రోడ్లను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హ్యామ్ రోడ్ల పనులను చేపట్టడానికి తొలివిడతగా సర్కిల్ కు రూ.421 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రోడ్లు పంచాయితీరాజ్ శాఖ ద్వారా మంజూరు కాగా ఆర్ అండ్ బీ నుంచి మరిన్ని రోడ్లు మంజూరుకానున్నాయని వివరించారు.
అద్భుతంగా నిర్మించుకుందాం..
హ్యామ్ తొలి విడతలో భాగంగా ప్రస్తుతం నవాబుపేట మండలంలో 3, బాలానగర్ మండలంలో 4, రాజాపూర్ మండలంలో 4, జడ్చర్ల మండలంలో 4, మిడ్జిల్ మండలంలో 3, ఊర్కొండ మండలంలో 2 రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. నవాబుపేట మండలం నుంచి లింగంపల్లి మీదుగా బాలానగర్ వ, రుద్రారం నుంచి కూచూరు మీదుగా మల్ రెడ్డిపల్లికి రోడ్డు, నవాబుపేట నుంచి పోమాల్ మీదుగా కేశవరావుపల్లి కి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. బాలానగర్ మండలంలో ఆర్ అండ్ బి రోడ్ నుంచి నేలబండతాండా, హేమాజీపూర్ మీదుగా బిల్డింగ్ తాండ వరకూ వెళ్లే రోడ్డు, జడ్పీ రోడ్ నుంచి బోడజంగంపేట్ మీదుగా అగ్రహారం పొట్లపల్లికి వెళ్లే రోడ్డు, బాలానగర్ నుంచి నందారం మీదుగా మోతీఘనపూర్ వెళ్లే రోడ్డు, బూర్గుల నుంచి లింగారం వెళ్లే 8 రోడ్లు ఈ పథకంలో ఎంపిక అయ్యాయన్నారు.
రాజాపూర్ మండలంలో 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి మర్రిబాయి తాండాకు వెళ్లే రోడ్డు, ఈద్గానిపల్లి జడ్పీ రోడ్డు నుంచి నాన్ చెరువు తాండా మీదుగా తిరుమలగిరి రోడ్ వరకూ వెళ్లే రోడ్డు, జాతీయ రహదారి నుంచి ముద్దిరెడ్డిపల్లి మీదుగా నందారం వరకూ వెళ్లే రోడ్డు, కుచ్చర్కల్ నుంచి ఖానాపూర్ వెళ్లే రోడ్డు నిర్మాణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి క్రాస్ రోడ్ నుంచి ఈర్లపల్లికి వెళ్లే రోడ్డు, అల్వాన్ పల్లి నుంచి తంగెళ్లపల్లి మీదుగా నస్రుల్లాబాద్ కు వెళ్లే రోడ్డు, బాదేపల్లి నుంచి బూర్గుపల్లి మీదుగా పెద్దతాండా వరకూ వెళ్లే రోడ్డు, మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి శివాలయం మీదుగా మంగలికుంట తాండాకు వెళ్లే రోడ్లు హ్యామ్ లో మంజూరు అయ్యాయని వివరించారు.
మిడ్జిల్ మండలంలో రాణిపేట్ నుంచి దొన్నూరు సింగందొడ్డి మీదుగా తొమ్మిదిరేకుల జడ్పీ రోడ్ వరకూ వెళ్లే రోడ్డు, వాడ్యాల నుంచి వేముల మీదుగా వెల్జాల్ కు వెళ్లే రోడ్డు, వేముల నుంచి మసిగుండ్లపల్లి మీదుగా చెన్నంపల్లి వరకూ వెళ్లే రోడ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అదేవిధంగా ఊర్కొండ మండలంలో ముచ్చర్లపల్లి నుంచి రామిరెడ్డిపల్లి, బొమ్మరాసిపల్లి, జగబోయిన్ పల్లి మీదుగా వెల్జాల వరకూ వెళ్లే రోడ్డు, మాదారం నుంచి గుడిగానిపల్లి మీదుగా మల్లాపూర్ క్రాస్ రోడ్డు వరకూ వెళ్లే రోడ్లు కూడా హ్యామ్ పథకంలో ఎంపికయ్యాయని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. హ్యామ్ రోడ్లలో రెండో విడతలోనూ, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టే హ్యామ్ రోడ్లలోనూ జడ్చర్ల నియోజకవర్గానికి మరిన్ని రోడ్ల నిర్మాణాలు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి వేగంగా ముందుకు తీసుకుపోతున్నామని వివరించారు.