25-10-2025 12:57:08 AM
శ్రీ చైతన్య పాఠశాలలను సీజ్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు శూన్యం
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 24: శ్రీ చైతన్య పాఠశాలలను సీజ్ చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి ఆదేశాలున్నప్పటికీ ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి సీజ్ చేయకపోవడంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో ముడుపులు అందడంతోనే చర్యలకు జంకుతున్నారని స్థానికులు ఆరోపిస్తునలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలను పెట్రోల్ బంక్ పక్కనే నడుపుతున్నారు. ప్రభుత్వ జీవో ఎం.ఎస్. నెంబర్ 145/1997-98 ఆక్ట్ ప్రకారం ఫైర్ ఎన్.ఓ.సి లేకుండా నడుపుతున్న పాఠశాలకు అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే వందలాది మంది చిన్నారి విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాఠశాలను వెంటనే ఖాళీ చేసి, వేరే భవనంలోకి తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
అధికారులు మాత్రం శ్రీ చైతన్య పాఠశాల పై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజకీయ కోణమా లేక లోపాయికారి ఒప్పందమా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో ధనార్జినే ధ్యేయంగా పాఠశాలను నడుపుతూ దాదాపు 1500 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య పాఠశాలపై ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు మాత్రం అనేక ఫిర్యాదులు వచ్చిన ఏమాత్రం తమకు పట్టనట్లుగా ప్రైవేటు పాఠశాలలకు తాము వత్తాసుగా పనిచేస్తున్నట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ప్రభుత్వ అధికారుల పనితీరులో చలనం రాదా..! ప్రమాదం జరిగిన తర్వాత ఆగమేఘాలపై ‘చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు‘ వ్యవహరిస్తే లాభం ఏమిటి...? ఎవరి లాభం కోసం ఈ కాలయాపన అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.