calender_icon.png 19 November, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 1న పటాన్ చెరులో వందేమాతరం 150 వసంతాల సంబురాలు

19-11-2025 08:00:14 PM

30 వేల మంది విద్యార్థులతో ఒకే సారి, ఓకే సమయాన సామూహిక  వందేమాతరం గీతాలాపన

పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు: వందేమాతర గీతం రచించి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు డిసెంబర్ 1న పటాన్ చెరు పట్టణంలో 30 వేల మంది విద్యార్థులతో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వందేమాతరం 150 ఏళ్ల సంబరాలు కార్యక్రమం పై వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్ళు, కరస్పాండెంట్,  ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నినాదంగా మారిన వందేమాతరం గేయం కేవలం పాట మాత్రమే కాకుండా దేశభక్తి, ఐక్యత, త్యాగం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. బంకిమ్‌ చంద్ర చట్టర్జీ రాసిన ఈ గేయం స్వాతంత్య్ర సమరయోధుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు, తరతరాలను దేశ ప్రేమతో ప్రేరేపించిందని ఉద్ఘాటించారు. అదే విధంగా వందేమాతరం మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నిత్య చైతన్య గేయమని అన్నారు. 

వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలోని నోవాపాన్ పరిశ్రమ సమీపంలోని మైదానంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు,. సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాల, కళాశాలలకు విద్యార్థినీ విద్యార్థులు, అన్ని శాఖల ఉద్యోగులు, పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలిపారు.  కార్యక్రమం సందర్భంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.