28-11-2025 12:27:35 AM
విదేశీ స్టార్స్‌కు సైతం భారీ ధర
వరల్డ్ కప్ విన్నర్స్‌పై కాసుల వర్షం
మహిళా క్రికెట్‌కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో వరల్డ్ కప్ విన్నింగ్ స్టార్స్‌పై కాసుల వర్షం కురిసింది. దీప్తి శర్మ నుంచి శ్రీచరణి వరకూ మెగాటోర్నీలో అదరగొట్టిన పలువురు భారత క్రికెటర్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు వెచ్చించాయి. వచ్చే సీజన్‌కు ముందు జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో దీప్తి శర్మ ఏకంగా రూ.3.20 కోట్లకు అమ్ముడైంది.
అలాగే అమేలీ కేర్, సోఫీ డివైన్, మెగ్ లానింగ్, శ్రీచరణి, లారా వోల్వార్ట్ కూడా రికార్డ్ ధరలను దక్కించుకున్నారు. భారీ ధర పలికిన క్రికెటర్లంతా ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నవారే. వ్యూహాత్మకంగా కొన్ని ఫ్రాంచైజీలు ఆర్టీఎం ఆప్షన్‌ను ఉపయోగించుకోవడంతో ఆయా స్టార్ క్రికెటర్లకు బాగా కలిసొచ్చింది. అంచనాలున్న పలువురు క్రికెటర్లు వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం ఆశ్చర్యపరిచింది.
న్యూఢిల్లీ, నవంబర్ 27 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలో ఊహించినట్టుగానే భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రికార్డ్ ధర పలికింది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. దీంతో వేలంలో ఆమెకు భారీ డి మాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆమె బిడ్డింగ్ సమయంలో హైడ్రామా నడిచింది.
రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన దీప్తి కోసం అదే ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేసింది. ఆర్టీఎం ఆప్షన్ ఉండడంతో యూపీ వారియర్స్ దానికి సిద్ధప డింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి ధరగా రూ.3.20 కోట్లు ఆఫర్ చేయడంతో అదే ధరను ఇచ్చేందుకు యూపీ వారియర్స్ అంగీకరించింది. ఫలితంగా ఆర్టీఎం ద్వారా దీప్తి శర్మ మళ్లీ పాత జ ట్టుకే వచ్చింది. గత సీజన్‌లో ఆమెను రూ.2.60 కోట్లకు యూపీ దక్కించుకుంది. వేలానికి ముందు రిటైన్ చేసుకోని యూపీ ఆర్టీఎంలో భారీ మొత్తం వెచ్చించాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్‌గా దీప్తి రికార్డులకెక్కింది. గతంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ధర పలికిన క్రికెటర్లలో ఎక్కువ మంది విదేశీ ప్లేయర్సే ఉన్నారు. న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియా కేర్‌ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే దేశానికి చెందిన సోఫీ డివైన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మెగ్ లానింగ్ కోసం కూడా ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీపడ్డాయి.
లానింగ్‌ను యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ రూ. 1.90 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక విండీస్ ఆల్‌రౌండర్ చినెల్లి హెన్రీ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూ పించాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లకు ఆమెను దక్కించుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్‌ను రూ.1.10 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. గత సీజన్‌లో రూ.30 లక్షలే పలికిన ఈ సఫారీ స్టార్ ప్లేయర్ ఇటీవల వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారించింది.
శ్రీచరణికి భారీ ధర
డబ్ల్యూపీఎల్ వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి జాక్‌పాట్ కొట్టింది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి స్పిన్నర్‌గా ఇటీవల ప్రపంచకప్‌లో తనదైన మార్క్ చూపిం చింది. ఫలితంగా వేలంలో ఆమె కోసం గట్టిపోటీనే నడిచింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన శ్రీచరణి కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. దీంతో బిడ్డింగ్ ధర పెరుగుతూ పోయింది.
చివరికి రూ.1.30 కోట్లకు శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా ఢిల్లీకే ఆడిన ఈ తెలుగమ్మాయికి అప్పుడు రూ.55 లక్షల ధర పలికింది. ప్రపంచకప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఇప్పుడు రెట్టింపు మొత్తం వచ్చింది. వరల్డ్‌కప్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్స్‌లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ భారత్ విజయానికి కారణమైంది.
ఇదిలా ఉంటే హైదరాబాదీ క్రికెటర్ అరుంధతి రెడ్డిని వేలంలో ఆర్సీబీ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేకు వేలంలో మంచి డిమాండ్ కనిపించింది. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమె కోసం ఆర్సీబీ, యూపీ తీవ్రంగా పోటీపడ్డాయి. హోరాహోరీ బిడ్డింగ్‌లో యూపీ వారియర్స్ రూ.2.40 కోట్లతో శిఖా పాండేను సొంతం చేసుకుంది. అలాగే భారత పేసర్ రేణుకాసింగ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.60 లక్షలకు, ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్‌ను రూ.85 లక్షలకు యూపీ వారియర్స్ ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకుంది.
అధరహో
భారత క్రికెటర్లలో టాప్
1. దీప్తి శర్మ రూ. 3.20 కోట్లు
2. శిఖా పాండే రూ. 2.40 కోట్లు
3. శ్రీచరణి రూ. 1.30 కోట్లు
4. ఆశా శోభన రూ. 1.10 కోట్లు
5. భారతి పుల్‌మలి రూ. 70 లక్షలు
విదేశీ క్రికెటర్లలో టాప్
1. అమేలియా కేర్ రూ. 3 కోట్లు
2. సోఫీ డెవైన్ రూ. 2 కోట్లు
3. చినెల్లే హెన్రీ రూ. 1.30 కోట్లు
4. ఫోబే లిచ్‌ఫీల్డ్ రూ. 1.20 కోట్లు
5. లారెన్ బెల్ రూ. 90 లక్షల