calender_icon.png 26 October, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగృహ ప్లాట్లకు మళ్లీ ఈవేలం

26-10-2025 12:08:44 AM

  1. కుర్మల్‌గూడ, తొర్రూర్, బహదూర్‌పల్లిలో 167 ప్లాట్ల విక్రయం
  2. గత వేలం ధరల కంటే తక్కువకే కనీస ధరల నిర్ధారణ 
  3. ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో వేలం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరో సువర్ణావకాశం కల్పిస్తోంది. హైదరాబాద్ శివారులోని మూడు కీలక ప్రాంతాల్లో ఎలాంటి వివాదాలు లేని, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 167 ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్‌గూడ, తొర్రూర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో ఉన్న ఈ ప్లాట్లకు  ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకమైన విధానంలో ఈ ప్లాట్లను విక్రయిస్తున్నామని, కొనుగోలుదారులు స్వేచ్ఛగా పాల్గొని తమకు నచ్చిన ధరకు స్థలాలను దక్కించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

వేలం వివరాలు...

తొర్రూర్‌లో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో 120 ప్లాట్లు, కుర్మల్‌గూడలో 200 నుంచి 300 చదరపు గజాల విస్తీర్ణంలో 29 ప్లాటు, బహదూర్‌పల్లిలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలో 18 ప్లాట్లు.

గత ధరల కంటే తక్కువకే అవకాశం

గతంలో నిర్వహించిన వేలంలో ఈ ప్లాట్లకు విశేష స్పందన లభించి, హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని అధికారులు గుర్తుచేశారు. తొర్రూర్‌లో గత వేలంలో గజం గరిష్టంగా రూ. 67,500 పలకగా, ప్రస్తుతం కనీస ధరను కేవలం రూ. 25వేలుగా నిర్ధారించారు. అలాగే కుర్మల్‌గూడలో గతంలో గజం రూ. 29వేలు పలికినప్పటికీ, ఇప్పుడు కనీస ధరను రూ. 20 వేలుగా నిర్ణయించారు.

బహదూర్‌పల్లిలో గతంలో గజం రూ. 47వేలు వరకు పలికినా, ప్రస్తుతం కూడా పాత కనీస ధరలకే (కార్నర్ ప్లాట్లు రూ.30 వేలు, ఇతర ప్లాట్లు రూ.27 వేలు) విక్రయిస్తున్నారు.కాగా ఈ-వేలంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి: రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 27.

ఈ-వేలం అక్టోబర్ 28న జరుగుతుంది ఉదయం కుర్మల్‌గూడ, మధ్యాహ్నం బహదూర్‌పల్లి.కాగా తొర్రూర్: రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 28. ఈ-వేలం అక్టోబర్ 29, 30 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది. పూర్తి వివరాల కోసం  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.