calender_icon.png 5 August, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో పోటీపరీక్ష వివాదం

31-12-2024 12:00:00 AM

ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి.ప్రశ్న పత్రాలు లీక్ కావడం, ఫలితంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆ పరీక్షలను రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగడం సర్వసాధారణమయ్యాయి.

తాజాగా ఈ నెల 13న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీసీఎస్‌సీ) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్న పత్రం లీకయిందని, అందువల్ల ఆ పరీక్షను రద్దు చేసి తాజాగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది విద్యార్థులు పరీక్ష జరిగిన రోజునుంచీ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతుండడంతో ఇది ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

2,035 ఖాళీల భర్తీ కోసం బీపీఎస్‌సీ నిర్వహించిన ఈ కంబైన్డ్ కామన్ ఎంట్రన్స్ (సీసీఈ) పరీక్ష కోసం దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 912 సెంటర్లలో ఈనెల 13న నిర్వహించిన పరీక్షకు మూడున్నర లక్షల మందికి పైగా హాజరయ్యారు.

అయితే పాట్నాలోని బాపు పరీక్షా పరిసార్ కేంద్రంలో పరీక్ష మొదలైన కొద్ది సేపటికే వందలాది మంది విద్యార్థులు సెంటర్‌లోకి చొరబడి పరీక్ష పేపర్ లీకయిందని ఆరోపిస్తూ అధికారుల చేతుల్లోని ప్రశ్నపత్రాలను లాక్కుని చించివేసి గందరగోళం సృష్టించారు. కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీకయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం, విద్యార్థులు ఆందోళకు దిగడం జరిగిపోయాయి.

అయితే రాష్ట్రంలోని ఏ సెంటర్‌లోనూ ప్రశ్నపత్రం లీకయినట్లు వార్తలు రాలేదని, బాపూ సెంటర్‌లో కొంతమంది అభ్యర్థులు సృష్టించిన గొడవ కారణంగా అక్కడ మాత్రం పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించడం జరుగుతుందని బీపీఎస్‌సీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు మరింత రెచ్చిపోయారు.

మొత్తం పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆదివారం గాంధీమైదాన్ వద్దనుంచి ముఖ్యమంత్రి నివాసానికి ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యార్థులను చర్చలకు ఆహ్వానించినా వారు శాంతించలేదు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో భేటీకి పట్టుబట్టారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య గొడవ మొదలైంది.

ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి చితకబాదడంతో పాటు వారిపై వాటన్ క్యానన్లు సైతం ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. జన్ సురక్షా పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించడంతో అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. 

మరోవైపు ప్రశాంత్ కిశోర్, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పోలీసుల చర్యకు నిరసనగా ఆందోళనకారులు సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా పలు రాజకీయ పార్టీలు దానికి మద్దతు తెలిపాయి. పోలీసు చర్యలకు నిరసనగా జనవరి 2నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రశాంత్ కిశోర్ ప్రకటించడంతో సమస్య మరింత జటిలంగా మారింది.

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ,ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ కూడా డబుల్ ఇంజిన్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ బీహార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌లాంటి మరికొన్ని పార్టీలు కూడా విద్యార్థులపై చర్యను తప్పుబట్టాయి. అయితే కోచింగ్ సెంటర్ల యజమానులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.

ప్రతి పోటీ పరీక్ష సమయంలోను ఏదో ఒక గొడవ జరగడం మామూలైందని, దీనివెనక కుట్ర ఉందని వారంటున్నారు. అయితే గతంలో బీహార్‌లో పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయిన నేపథ్యంలో  ప్రస్తుత పరీక్షపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరి ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.