30-12-2024 12:00:00 AM
“వాగ్దేవీ వదనే మమస్ఫురతు
యాధ్వన్యాత్మనోల్లాసినీ
వర్ణవ్యక్త ముపాగతాచ
తదనుస్థాన ప్రయత్నాదిభిః
భావానాం పదసంజ్ఞయా
విదధతీ త్రేధాసముల్లేఖనా
న్యానందాననుసందధాతి విదుషాం
ప్రాప్తామహా వాక్యతామ్”
అంటూ ‘చమత్కార చంద్రిక’ పేరుతో విశ్వేశ్వర కవి తాను రచించిన ఒక అపురూప అలంకార శాస్త్రంలోని తొట్టతొలి శ్లోకంలోనే తన ఆలోచనాత్మక ఆశయాన్ని వ్యక్తీకరించాడు. ఏ కవి రచించిన ఏ కావ్యమైనా ధ్వన్యాత్మకంగా గొప్ప పద సంయోజనంతో, అపురూప భావ సమన్వితంగా ఉంటే అది విద్వాంసులకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. కనుకనే, విశ్వేశ్వర కవి కవులకు కరదీపికగా నిలిచే ఒక గొప్ప అలంకార శాస్త్రాన్నే అందించాడు.
ఎనిమిది విభాగాలుగా
‘చమత్కార చంద్రిక’
చమత్కారమే కావ్యాత్మగా నిర్ధారించుకున్న విశ్వేశ్వరుడు శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండే చమత్కారానికి గుణ, రీతి, రస, వృత్తి, పాక, శయ్య, అలంకారాలు కారణమవుతాయని చెబుతూ తన ‘చమత్కార చంద్రిక’ను 8 విభాగాలుగా రచించాడు.
ప్రథమ విలాసము, ద్వితీయ విలాసము, తృతీయ విలాసము, చతుర్థ విలాసము, పంచమ విలాసము, షష్ఠ విలాసము, సప్తమ విలాసము, అష్టమ విలాసము అని విభజించుకున్న ఈ ఎనిమిది భాగాలలో వర్ణ, పఠ వివేకము, వాక్య పద లక్షణము, గుణ దోష ప్రబంధ వివేకము, రస వివేకము, శబ్దాలంకార, అర్థాలంకార, ఉభయాలంకార వివేకములను ప్రామాణిక పద్ధతిలో వివరించాడు.
విశ్వేశ్వరుడు కేవలం ఆలంకారికుడు మాత్రమే కాడు అనడానికి కారణం ఆయన రచించిన ‘వీరభద్ర విజృంభణం’ అనే ‘డిమం’, ‘కరుణా కందళం’ అనే ‘అంకం’ ఈ రెండు రచనలు విశ్వేశ్వరునిలోని కవినే గాక ప్రక్రియా వైవిధ్యం చూపించగలిగే గొప్ప ప్రయోగ శీలిగా కూడా పేర్కొనవచ్చు. కాచవిభుడు, విఠలనాథుడనే తెలుగు తొలి జంటకవులు కూడా 14వ శతాబ్దికి చెందిన వారే.
విశ్వేశ్వరుడు జీవించిన ఈ 14వ శతాబ్దంలోనే సింహగిరి వచనాలు రచించిన కృష్ణమాచార్యులు, సంస్కృత భాషా కవయిత్రి, కాకతీయ కాలపు ఓరుగల్లు ఆడబిడ్డ, మధురా విజయ మహాకావ్యాన్ని అందించిన గంగాదేవి కూడా 14వ శతాబ్దియే కావడం ఈ శతాబ్దం ఎన్ని ప్రక్రియల్లో ,ఎన్ని కృతులను అందించిందో అర్థమవుతున్నది.
గొప్ప అలంకార శాస్త్ర గ్రంథం
విశ్వేశ్వరుని ‘చమత్కార చంద్రిక’ విశేషమైన, గొప్ప అలంకార శాస్త్రగ్రంథం. లక్ష్య లక్షణాల ఆవశ్యకత ఎక్కువ. ఇందులో లక్ష్యం కృతికర్త చెప్పినా లక్ష్యాలుగా తన శ్లోకాలేగాక కాళిదాసు, భారవి, మాఘుడు, జయదేవుడు, బాణుడు మొదలైన మహాకవుల కృతుల నుంచి కూడా ప్రమాణాలను చూపించడం కృతికర్త వ్యుత్పత్తికి నిదర్శనం.
అంతేగాక, సందర్భానుసారంగా తనకన్నా పూర్వ ఆలంకారికులైన దండి, ఆనంద వర్ధనుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, కాశీశ్వర మిశ్రుడు వంటివారి గ్రంథాలైన ‘కావ్యాదర్శము’, ‘ధ్వన్యాలోకము’, ‘రసార్ణవ సుధాకరము’, ‘రస మీమాంస’ వంటి రచనలే గాకున్నా భరతుడు, భామహుడు, భోజుడు వంటి ప్రాచీన ఆలంకారికుల నుంచి కూడా ప్రమాణాలను చూపించి తన రచన స్థాయిని పెంచిన ఆలంకారిక శిరోమణి విశ్వేశ్వరుడు.
సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు కీ.శే. చిలుకూరి పాపయ్యశాస్త్రి సర్వజ్ఞ సింగభూపాలుని ‘రసార్ణవ సుధాకరము’, విశ్వేశ్వర కవి ‘చమత్కార చంద్రిక’లను తులనాత్మకంగా అధ్యయనం చేసి ఎన్నెన్నో నూతనాంశాలను ప్రతిపాదించారు. వాటిని శాస్త్రీయంగా నిర్ధారించారు. రెండింటిలోనూ లక్షణ నిర్మాణంలో సారళ్యం కనిపిస్తుంది.
అదే విధంగా లక్షణ సమన్వయ సందర్భాల్లో ఇతర ఆలంకారికుల సిద్ధాంతాలను ఖండన చేసే విషయాల్లోను ఏకరూపతే కనిపిస్తుంది. ఇరువురు రచించిన లక్ష్యాలకు సంబంధించిన స్వీయ రచనల్లోని శ్లోకాల మాధుర్యంలో కూడా ఎంతో సామ్యత ఉంది. కాని, కొన్ని కొన్ని సందర్భాలు ఇరువురి అభిప్రాయాల్లో భిన్నత్వం దృగ్గోచరమవుతుంది.
ఇరువురూ సమకాలీనులే అయినా, తాను సింగభూపాలుని ఆశ్రితుడే అయినా తన స్వతంత్ర భావాభివ్యక్తిని ఈ గ్రంథంలో కృతికర్త వ్యక్తపరచడం ఆయన పాండిత్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి నిదర్శనం. ‘రసార్ణవ సుధాకరము’లో స్వీయరచనలు అల్పంగా ఉంటాయి. కాని, విశ్వేశ్వరుని కృతిలో ఇవి అధికం.
స్వీయ రచనకే ప్రాధాన్యం
అదే విధంగా సింగభూపాలుడు తన గ్రంథంలో లక్ష్యాలుగా ఇతర కవుల కావ్యాల్లోని పద్యాలను ఎక్కువగా ఉదాహరిస్తే ఈ విషయంలో విశ్వేశ్వర కవి ఇతరుల శ్లోకాలను అక్కడక్కడ మాత్రమే ఉపయోగించుకున్నాడు. దీనినిబట్టి స్వీయకవితా రచనవైపే విశ్వేశ్వరుడు మొగ్గు చూపినట్లు అర్థమవుతున్నది.
వీరికి పూర్వ ఆలంకారికుడైన భోజుడు రచించిన ‘సరస్వతీ కంఠాభరణము’ అనే అలంకార శాస్త్రంలోని అనేక సిద్ధాంతాలను ‘రసార్ణవ సుధాకర’ కర్త సింగభూపాలుడు అంగీకరించక పోవడమేగాక ఖండించడం కూడా చేశాడు. కాని, విశ్వేశ్వరుడు అనేక సందర్భాల్లో భోజుని మతాన్ని అనుసరించి ఉపయోగించుకున్నాడు.
ఈ విధమైన అనేక విశేషాలను చిలుకూరి పాపయ్యశాస్త్రి చర్చించడానికి ప్రధాన కారణం వారిద్దరి ప్రతిభను తెలియజెప్పడమేగాక విశ్వేశ్వరుని స్వతంత్ర ప్రవృత్తినికూడా తెలియజేస్తున్నది. అంతేగాక సమకాలీనులైన ఇద్దరు శాస్త్రకారుల ఆలోచనలకు ఈ విధానం అద్దం పడుతున్నది.
కాకపోతే, ‘రసార్ణవ సుధాకరం’లో విపులంగా చర్చకు వచ్చిన నాయికా నాయక స్వరూప ఉదాహరణలు, రసభావాదులు, దశవిధ రూపకాలు విశ్వేశ్వర కవి తన ‘చమత్కార చంద్రిక’లో పూర్తిగా విడిచి, వీటిలో కొన్నింటిని మాత్రం చాలా సూక్ష్మంగా చర్చించాడు. సంస్కృత ఆలంకారికులెవ్వరూ చర్చించని ఎన్నో ఛందో విషయాలు ఇందులో చర్చించి తన ప్రతిభను చాటుకున్నాడు.
రూపకం దశధాప్రోక్తం నాటకాది విభేదతః
మహాప్రబంధసామ్రాజ్యమధికర్తుమిదం క్షమమ్
సింగభూపాల రచితే రసార్ణవ సుధాకరే
అస్య ప్రపంచో విజ్ఞేయః
కే తథా వక్తుమీశ తే॥
అంటూ కవి ‘రసార్ణవ సుధాకర’ కృతికర్త తమ రాజైన సింగభూపాలుణ్ణి మాత్రం గొప్పగా వర్ణించాడు. ఈయనే కాక ‘అమర పద పారిజాతము’ అనే గ్రంథ రచయిత అయిన బొమ్మకంటి అప్పయాచార్యుడు కూడా ఈ రాజ వైభవాన్ని ఘనంగా వర్ణించి, ఈయనను వీరిద్దరూ సర్వజ్ఞునిగా కీర్తించారు.
పదిహేను కావ్య దోషాలు
విశ్వేశ్వర కవి తన లక్షణ గ్రంథంలో లక్షణముల నామములు చాలావరకు ప్రాచీన ఆలంకారికులు చెప్పినవి గాకుండా తానే స్వయంగా నిర్మించినవే. ఈ ‘సరస సాహిత్య ధురీణుడు’ కావ్యాలకు చమత్కారం ఎంత ముఖ్యమో, దోష రాహిత్యం కూడా అంతే ముఖ్యమని భావించి ప్రత్యేకమైన దోషాలను గురించి చర్చించాడు.
దాదాపు పదిహేను విధాలైన కావ్య దోషాలను సోదాహరణంగా విపులీకరించి కవులకే మార్గదర్శనం చేశాడు. అర్థదోషం, పదదోషం, అపభ్రష్ట దోషం, అప్రమేయ దోషం అంటూ ప్రత్యేకమైన పేర్లతో దోషాలను వివరించి వీటిని కవులు విధిగా పరిహరించాలని స్పష్టంచేశాడు. పైగా-
“కర్తుం కారయితుశ్శ్రోతుః
ఫలాకాంక్షా ప్రవృత్తి తః
నిర్దోషస్యైవ కావ్యస్య
ఫలోత్పాదన శక్తితః॥”
అంటూ కావ్యం నిర్దోషమైనప్పుడే కవికి, ప్రేరకునికి, పాఠకునికి కూడా సరైన ఫలితాన్నిచ్చి ఆనందహేతువై కీర్తిని పొందుతుందని నిశ్చయంగా చెప్పాడు.
సాహిత్య ప్రపంచంలో ఎప్పుడూ సృజన కర్తలైన కవులకు ప్రాచుర్యం ఉంటుంది. ఉత్తమ కవిత్వ సృష్టి యావత్ ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుంది. అందుకే, ఆనాటి నుంచి నేటి వరకు పలువురు ఆలంకారికులు తమ తమ శాస్త్రాల మూలంగా ఉత్తమ కవిత్వ సృష్టి చేసే కవులకు అనేక విధాలుగా మార్గదర్శనం చేశారు.
తెలుగునేలపై కాకతీయ రాజ్యంలో విద్యానాథుడు, పద్మనాయక రాజ్యంలో సింగభూపాలుడు, విశ్వేశ్వరుడు మొదలైన మహామహా ఆలంకారికులు కవులకు కవిత్వ ధర్మాల ప్రాశస్త్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
ఆ మార్గంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న విశ్వేశ్వర కవి చంద్రుడు తన అసమాన ప్రతిభా పాండిత్యాలతో కవులకు వెలుగులు పంచిన అపురూప ఆలంకారికునిగా సాహితీ ప్రపంచంలో చిరస్మరణీయుడైనాడు.
సింగభూపాలుని ఆస్థాన కవి
విశ్వేశ్వర కవిచంద్రునిగా కీర్తిని పొందిన ఈ మహా భాషా శాస్త్రవేత్త 14వ శతాబ్దికి చెందిన వానిగా సాహిత్య చరిత్రకారులు నిర్ధారించారు. ఈయన ‘రసార్ణవ సుధాకర’ కర్తయైన పద్మనాయక రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి, ‘రస మీమాంస’ గ్రంథ రచయిత అయిన కాశీశ్వర మిశ్రుని శిష్యుడని చరిత్రకారులు పలు ప్రమాణాలతో నిర్ణయించారు.
ఈ విశ్వేశ్వర కవి సర్వజ్ఞ సింగభూపాలుని శౌర్య, ఔదార్యాలను, ఆయన సాహితీ ధురీణత్వ ప్రశస్తిని వర్ణించిన వానినిబట్టి చరిత్రకారులు ఈ నిర్ణయాన్ని వెలువరించారు.
తన రచనలోని గద్యలో ‘ఇతి సరస సాహిత్య చాతురీ ధురీణ, విశ్వేశ్వర కవి చంద్ర ప్రణీతాయాం, శ్రీ సింగభూపాల కీర్తి సుధాసార శీతలాయాం, చమత్కార చంద్రికాయాం వర్ణ పద వివేకోనామ ప్రథమో విలాసః’ అని స్పష్టంగా సింగభూపాల ప్రసక్తిని చెప్పిన దానినిబట్టి కూడా ఇతడు ఆయన ఆస్థానకవిగా భావించవచ్చు.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448