10-07-2025 09:54:24 PM
పూజారినీ సస్పెండ్ చేయాలి..
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కు మహిళ, దంపతుల ఫిర్యాదు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి బుగ్గ దేవాలయం పూజారి రాంబట్ల వేణుగోపాల శర్మపై మరోసారి దేవదాయశాఖ కమిషనర్ కు చేసిన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. గురువారం కమిషనర్ కు కాసిపేట మండలం బుగ్గ గూడెంకి చెందిన గుండ భీమక్క, గణపతి దంపతులు హైదరాబాద్ కు వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గ దేవాలయం పూజారి రాంబట్ల వేణుగోపాల శర్మ ఇటీవలనే పలు ఆరోపణ నేపథ్యంలో ఆయననూ పూజారి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేల తిరగకుండానే మళ్లీ ఆయన పూజారీగా బుగ్గ దేవాలయంలోనే విధులు చేపట్టారు.
ఆయన అర్చక వృత్తిని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నైతికంగా చేపట్టడం లేదన్న ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. దీప దూప నైవేద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా దేవాలయానికి వచ్చే మహిళా భక్తుల పట్ల అర్చకుడి ముసుగులో అనైతికంగా వ్యవహరిస్తున్నారనీ, పిల్లలు కానీ భక్తురాళ్ళపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని అర్చక వృత్తికి అన ర్హుడనీ వెంటనే సస్పెండ్ చేయాలని భీమక్క గణపతి దంపతులు కమిషనర్ కు చేసిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. బుగ్గ దేవాలయంలోనే పూజారిగా పని చేస్తున్న వేణుగోపాల శర్మ తన పలుకుబడితో ఇక్కడే చిరకాలంగా ఉంటున్నాడు. మహిళా భక్తుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు ను ఎవరూ ధైర్యంగా చెప్పడానికి ముందుకు రావడం లేదనీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో దేవాలయానికి వచ్చే మహిళా భక్తుల పట్ల వ్యవహరించిన తీరుగానే తన పట్ల కూడా అసభ్యకరంగా, దురుసుగా వ్యవహరిస్తున్నాడని భీమక్క గణపతి దంపతులు ఆ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనంగా మారింది. తనకున్న పలుకువడితో ఏమి చేసినా చెల్లుతుందనే రీతిలో ఆయన భక్తుల పట్ల అమర్యాదoగా వ్యవహరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఇలా అనేక ఆరోపణల తో సస్పెండ్ అయిన ఆయన మళ్లీ విధులు చేపట్టి తన ప్రవర్తనను యధాతధంగా కొనసాగిస్తున్నాడని తెలిపారు. దేవాలయం వద్ద ఎంతో కాలంగా కొబ్బరికాయలు, ఇతర పూజ వస్తువులు విక్రయిస్తున్న తనను పూజారి వేణుగోపాల శర్మ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. కొబ్బరికాయలు గుడి ప్రాంగణంలో విక్రయించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. తన ప్రవర్తనను ఎదిరించినందుకు కక్ష కట్టి తనను ఇబ్బందులకి గురి చేస్తున్నాడని వాపోయారు.
దేవాలయం వద్ద పూజారి వ్యవహరిస్తున్న తీరును అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజీ లను పరిశీలించి విచారణ చేయాలని భీమక్క గణపతి దంపతులు దేవదాయ శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. మహిళా భక్తుల పట్ల చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తున్న ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్ కు విన్నవించిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఓ పూజారీ పై సాక్షాత్తు ఓ మహిళ తనపై అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని భర్తతో కలిసి దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం బెల్లంపల్లిలో దుమారం లేపింది. ఈ విషయం పై స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా భీమక్క గణపతి దంపతులు కలిసి విన్నవించారు. అవాంఛనీయ చర్యలకి పాల్పడుతున్న పూజారిపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని భీమక్క గణపతి దంపతులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను వేడుకున్నారు.