16-12-2025 09:55:32 PM
12 నెలలు అయినా అందని వేతనాలు..
ఆర్థిక అవస్థలతోనే ఆగుతున్న గెస్ట్ గుండెలు..
ఆగం అవుతున్న అతిథి అధ్యాపకుల కుటుంబాలు..
హనుమకొండ (విజయక్రాంతి): గత 15 రోజుల్లోనే హార్ట్ఎటాక్ తో ముగ్గురు గెస్ట్ లెక్చరర్లు మరణించారు. గత రెండేళ్లలో దాదాపుగా 8 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన క్యాతం రమేష్ అనే ఫిజిక్స్ అతిథి అధ్యాపకుడు రంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కూతుర్లు, మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో హార్ట్ఎటాక్ తో మరణించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
జీతాలు రాకపోవడంతో, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ పోషణ భారం, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించడం కష్టంగా మారడంతో మానసిక క్షోభకు గురి కావడంతో హార్ట్ఎటాక్ కు గురైనట్లు పలువురు అతిథి అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగికి ఒక్క రెండు రోజులు వేతనాలు అటు ఇటుగా వస్తెనే ఆగం ఆగం అవుతారు. అలాంటిది అతిథి ఉద్యోగుల వేతనాలు, పని విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గత విద్యా సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలకు గాను పనిచేసిన జీతాలు ఇప్పటివరకు చెల్లించకపోవడం వల్ల అతిధి ఆధ్యాపకులు ఆర్థికంగా, మానసికంగా ఆవేదనకు గురవుతున్నారు.
దీనికి ప్రధాన కారణం ఎవరు? అసలు ఈ చావులకు కారణం ఎవరు?
మన ప్రభుత్వమా?
ఇంటర్ బోర్డు కమీషనరా? అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. సంవత్సరం గడిచిన పని చేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారమై, పలువురు అతిథి అధ్యాపకులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ అనుసరించి సుమారు 1200 మంది కొత్త అధ్యాపకులను నియమించినప్పటికీ, మిగిలిన ఖాళీల బోధనకు అతిథి అధ్యాపకులను నియమించిన ప్రభుత్వం, గత విద్యా సంవత్సరం జీతాలు చెల్లించడంలో తాత్సారం చేస్తుంది.
ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అతిథి అధ్యాపకులకు 45 వేల జీతాన్ని 12 నెలలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అతిధి ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మృతి చెందిన ఫిజిక్స్ అతిథి అధ్యాపకుడు రమేష్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అతిథి అధ్యాపకుల రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు మహేష్, అతిథి అధ్యాపకుల రాష్ట్ర నాయకులు ఐలీ సదానందం గౌడ్, కనకరాజు, యాదయ్య, శశిధర్,మహేందర్, పాండు, రాజ్ కుమార్,రమేష్,కళ్యాణ్,రాజేందర్,నరేష్, జంగయ్య తదితరులు సంతాపం ప్రకటించారు.