17-12-2025 12:00:00 AM
పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి..
పోలింగ్ శాతం రిపోర్ట్ సమయానుసారంగా ఎప్పటికప్పుడు అందించాలి..
కామారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్..
బాన్సువాడ, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో 2వ సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికలలో భాగంగా నేడు బుధవారం నిర్వహించే మూడవ విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఎన్నికల సామాగ్రి బస్సుల ద్వారా తరలించడం సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.
విధులు నిర్వహించే అధికారులు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని , ఏమైన సమస్యలు ఎదురైతే తక్షణమే ఉన్నతాధికారులకు తెలియజేయాలని అన్నారు.బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ మండలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బిచ్కుంద మండలం, జుక్కల్ మండలాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు ఇచ్చిన పోలింగ్ సామాగ్రిని చెక్ లిస్ట్ లో చూసుకోవాలని, ఆయా గ్రామ పంచాయతీ లలోని పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న తర్వాత పోలింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువును తమ వద్ద ఉంచుకోవాలన్నారు. రిజరవ్డ్ కౌంటర్లో ఎంతమంది అధికారులు రిపోర్టు చేసారో పరిశీలించి, అవసరమైన గ్రామ పంచాయితీలలో వారు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
స్పెషల్ కౌంటర్లో బ్యాలెట్ పేపర్స్ తో పాటు పోలింగ్ కు అవసరమైన వివిధ ఫారాలను, కవర్లను, ఇతర సామాగ్రిని సరిచూసుకోవాలి, పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రిపోర్టింగ్ చేశాక రూట్ వారీగా సంబంధిత గ్రామ పంచాయతీలకు పోలింగ్ మెటీరియల్ తో వెళ్లేందుకు జోనల్ అధికారులు సహకరిస్తారన్నారు. ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలకు వాహనాల్లో తరలి వెళ్లే సమయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి తిరిగి రిసెప్షన్ కేంద్రానికి వచ్చేవరకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించినట్లు తెలిపారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్ ఎన్నికల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.