31-07-2025 12:44:52 AM
11కోట్ల కరెన్సీ కట్టలు
శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫాంహౌస్‌లో ఏపీ సిట్ అధికారులు తనిఖీలు
రంగారెడ్డి, రాజేంద్రనగర్ జూలై 30 (విజయక్రాంతి): ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల ఇండ్లు, కార్యాలయా ల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ లం కాచారంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న సులోచన ఫాంహౌస్‌లో ఏపీ సిట్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో 12 అట్టపెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల నగదును ఏపీ సిట్ పోలీసులు సీజ్ చేశారు. లిక్కర్ స్కీమ్ కేసులో ఏ1 నిందితుడైన రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు తాను డబ్బు దాచి ఉంచినట్టు లిక్కర్ స్కామ్‌లో ఏ-40గా ఉన్న వరుణ్ పురుషోత్తం వెల్లడించగా.. అతడి వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీ నగదు పట్టుబడింది.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాలతో 2024, జూన్ లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. మంగళవారం వరుణ్ పురుషోత్తం దుబాయ్ నుంచి రాగా, శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు.
ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. ఇతడిపై విజయవాడ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్‌కు చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. నగదుతో పాటు వరుణ్‌ను విజయవాడకు తీసుకెళ్లారు. అక్కడి సిట్ కార్యాలయంలో వరుణ్‌ను విచారిస్తున్నారు.
ఫాంహౌస్ ఓనర్ విజయేందర్‌రెడ్డి..
వర్ధమాన్ కాలేజీ వద్ద ఉన్న సులోచన ఫాంహౌస్ యజమాని తీగల విజయేందర్‌రెడ్డిగా గుర్తించారు. అతడి తల్లి సులోచన పేరిట ఫాంహౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. స్టోర్ రూమ్‌లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో నగదును దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును జప్తు చేశారు. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశం ఉంది.
ఏపీ సిట్ తొలి చార్జిషీట్‌లోనే యూపీ డిస్టిలరీ పేరును ప్రస్తావించింది. 16 డిస్టిలరీల ముడుపులే రూ.1,677.68 కోట్లుగా సిట్ గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థనే యూపీ డిస్టిలరీస్. హైదరాబాద్‌లోని ఆరేట్ ఆస్పత్రి డైరెక్టర్లుగా తీగల ఉపేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి ఉన్నారు. కాగా వర్ధమాన్ కాలేజీ విజయేందర్‌రెడ్డికి చెందినట్టుగా తెలుస్తోంది.
ఫాంహౌస్‌లో తనిఖీల అనంతరం ఇన్‌చార్జి వినయ్‌రెడ్డిని సైతం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం అందడంతో విజయేందర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగినట్టు ఆరోపించింది.
ఈ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం సైతం విడుదల చేసింది. కాగా ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్ అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి నాటి ప్రభుత్వ పెద్దలు రూ.3,500 కోట్ల ముడుపులు కొల్లగొట్టారని తన ప్రాథమిక విచారణలో తేల్చింది.