‘317 బాధితుల’ నుంచి దరఖాస్తులు స్వీకరణ
ఉద్యోగులు, టీచర్లకు ఈనెల 30 వరకు అవకాశం
క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన 317 జీవో కారణంగా సొంత జిల్లాలను వదిలి కొందరు టీచర్లు, ఉద్యోగులు పొరుగు జిల్లాల్లో పనిచేశారు. ఉద్యోగులైన భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు బదిలీఅయ్యారు. వీరి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బాధితుల సమస్యలపై బుధవారం క్యాబి నెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. వారి నుంచి 14 నుంచి 30 వరకు తిరిగి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది.
హైదరాబాద్ లోని సచివాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సభ్యులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లున భార్య/భర్తలకు గతంలో బదిలీల్లో అవకాశం కల్పించలేదని, వీరికి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అలాగే స్థానికతకు సంబంధించిన ఆప్షన్‌తోపాటు మల్టిపుల్ అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తున్నది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రశీదు అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో అందిన దరఖాస్తులను అధికారులు పునఃపరిశీలించనున్నారు. దరఖాస్తు స్టేటస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మొబైల్‌కు సందేశ రూపంలో పంపించనున్నారు.






