29 April, 2026 | 3:20 AM

అప్రోచ్ రోడ్లను విస్తరించాలి

29-04-2026 01:40 AM
  1. చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణకు 5 ఎకరాలు భూమి కావాలి
  2. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయండి
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఇరు వైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘హైదరాబాద్‌లో నానాటికీ పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల మూలంగా నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేటెర్మినళ్లపై అధిక భారం పడుతున్నది.

ఈ సమ స్యకు పరిష్కారంగా నగర పరిధిలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద రూ.430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్‌ను అభివృద్ధి చేశాం. కొత్త రైల్వే టర్మిన ల్‌ను ప్రారంభించుకున్న తరువాత ప్రతి రోజూ కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున్నాయి. ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరి గింది.

దీనికి అనుగుణంగా రైల్వేస్టేషన్‌కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు రైల్వేస్టేషన్‌కు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా అప్రోచ్ రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. అలాగే, పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన భూసేకరణ పూర్తి చేయాల్సి ఉన్నది’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

200 అడుగుల వెడల్పుతో రోడ్డు

‘ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాల్సి ఉన్నది. భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించ డానికి ప్రధాన రహదారిగా మారనున్నది. భరత్‌నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుంచి చర్లపల్లి స్టేషన్‌కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఇప్పటికే 30 అడుగుల రహదారి ఉన్నది. దీనిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలి.

ఈసీ నగర్ నుంచి చర్లపల్లి స్టేషన్‌లోని ఎంఎంటీఎస్ ప్లాట్ ఫాంను చేరుకునే రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నది. ఈసీ నగర్ ప్రధాన రహదారి నుంచి స్టేషన్‌ను చేరుకునే ఈ రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున విస్తరించాల్సిన అవసరం ఉన్నది. వీటితోపాటు చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్ ఫాం వైపు 2.70 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉన్నది’ అని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

తక్షణమే చర్యలు తీసుకోండి

‘చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్ల నిధులను కూడా రైల్వే శాఖ జమచేశాం. ఈ నీటి కనెక్షన్‌ను కూడా త్వరగా ఏర్పాటు చేయాలి. భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రూ.715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ధి చేస్తున్నాం. ఈ అభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉన్నది.

ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుంచి రేతిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరిం చాలి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ గతంలో ఉన్న ముఖ్యమంత్రికి 15 జూన్, 2022న, 07 మార్చి, 2023న రెండు ఉత్తరాలు రాశా. అదే విధంగా 8 సెప్టెంబర్, 2024న మీకు కూడా ఉత్తరం ద్వారా విషయం తెలియజేశా. అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదు.

మీరు.. నేను రాసిన ఉత్తరం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమస్య పరిష్కరించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అధికారుల బృందం రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్లను పరిశీలించి చర్యలకు ఉపక్రమించినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి ఫలితం లేదు.

కాబట్టి, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, నగరానికి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలి’ అని కిషన్‌రెడ్డి లేఖలో కోరారు.