29 April, 2026 | 3:23 AM

రూ.150 కోట్ల విలువైన మందులు గోల్‌మాల్ !

29-04-2026 01:40 AM
  1. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
  2. బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణరెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆరోపణ నిజమైతే ఎవరు బాధ్యులు, ఎలా జరిగిందనే విషయాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇది అబద్ధ ప్రచారమైతే ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.

వైద్య వ్యవస్థ నిర్వహణలో ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి.. ఇప్పుడు గడువు దాటిన మందులు ఉన్నాయని చెబుతున్నారని, ఆ మందులు ముందుగా ఎందుకు ఉపయోగించలేదు, ఎందుకు పంపిణీ చేయలేదు అన్నది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. ఈ వ్యవహారం చిన్న స్థాయి తప్పిదం కాదని, పైస్థాయి నుంచి జరిగిన అవినీతి అనే అనుమానం వ్యక్తమవుతోందని ఆయన ఆరోపిం చారు. ప్రజలకు కనీస వైద్యం కూడా అందని పరిస్థితిలో వందల కోట్ల రూపాయలు వృథా కావడం చాలా దురదృష్టకరమని, విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు.