calender_icon.png 7 June, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి బస్సులు భద్రమేనా?

07-06-2025 12:11:44 AM

  1. జిల్లాలో మొత్తం ప్రైవేట్ స్కూల్ బస్సులు 706  
  2. ఫిట్‌నెస్ జరిగినవి 294 ఫిట్‌నెస్‌కు దూరంగా 412 బస్సులు
  3. ఫిట్‌నెస్ లేని వాటిపై ఆర్టీఏ అధికారుల కొరడా

నల్లగొండ టౌన్, జూన్ ౬ : వేసవి సెలవులు ముగిసి పిల్లలు  జూన్ 12న బడిబాట పట్టబోతున్నారు . స్కూల్ బస్సుల్లో వెళ్లే విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో వందలాది బడి బస్సులు ఫిటెనెస్ లేకుండా రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎక్కడికక్కడ బస్సులను ఆపి సర్టిఫికెట్లను చెక్ చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నారు. 

విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది.   విద్యార్థులు కూడా హుషారుగా స్కూలుకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు . తల్లిదండ్రులు మాత్రం కంగారు పడుతున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చిన్నారుల బంగారు భవిష్యత్ అంధకారంగా మారుతోంది. పాఠశాలలు ప్రారంభం కాగానే పేరేంట్స్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేలాది మంది చిన్నారులు పాఠశాలల్లో అడ్మిషన్స్ పొందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా విద్యార్థుల భద్రతను మరిచిపోతున్నారు. జిల్లాలో పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోలేదు.

ప్రభుత్వం మే 15వ తేదీ నుంచే తమ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసినా విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లాలో పైవ్రేట్ విద్యా సంస్థలకు 706  బస్సులున్నాయి. ఇందులో 294 ఇప్పటివరకు వరకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. మిగతా 412 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు.

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై కొరడా...

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. స్కూల్స్ రీ ఓపెన్ కావస్తుండడంతో   విద్యార్థులను చేరవేసే బస్సులు కండిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే నిర్దాక్షిణ్యంగా సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, పైర్ ఎగ్జిట్తో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా తనిఖీ చేయబోతున్నారు. ఇందులో ఏది లేకున్నా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రులూ బాధ్యత తీసుకోవాలి...

విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు కండిషన్ గురించి అప్పుడప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలు వచ్చిపోయే బస్సుల విషయంలో యాజమాన్యం నిబంధనలు పాటిస్తున్నారో లేదో తరచూ పరిశీలించుకోవాలి. డ్రైవర్, అటెండర్ ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. బస్సు అతి వేగంగా వెళ్తుందా? డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా...? నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నారా..? పిల్లలను ఎక్కించి, దించేటప్పుడు బాధ్యతగా ఉన్నారా.. లేదా ? తెలుసుకోవాలి. డ్రైవరు, అటెండర్ తీరు ఎలా ఉందనే విషయాలను పిల్లలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి. సమస్యలు ఉంటే రవాణా అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి.

బస్సుల నిబంధనలివే...

విద్యా సంస్థల బస్సులు నడిపే డైవ్రర్కు కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలి. కంటి చూపు సరిగా ఉండాలి.స్కూల్ బస్సు పసుపు రంగులో ఉండాలి. బస్సులో సహాయకుడు తప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ను ఏర్పాటు చేయాలి.పిల్లలు సౌకర్యవంతంగా బస్సు ఎక్కేందుకు మెట్లు కిందకు ఉండాలి. బస్సులో కిటికీలకు అద్దాలు, గ్రిల్స్ ఏర్పాటు చేసి ఉండాలి.

బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక పరికరం, అత్యవసర ద్వారం ఉండాలి.వాహనం పర్మిట్, ఫిట్నెస్, కాలుష్య నియంత్రణ, బీమా, డ్రైవర్ లైసెన్స్ పత్రాలు బస్సులో ఉండాలి.విద్యా సంస్థ పేరు, ఫోన్ నంబరు, పూర్తి చిరు నామా బస్సుకు ఎడమ వైపున ముందు భాగంలో రాసి ఉంచాలి. బస్సు తలుపులు సురక్షితంగా లాకింగ్ సిస్టమ్తో ఉండాలి.బస్సులో సీటింగ్ సామర్థ్యం కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లొద్దు.

ఫిట్‌నెస్ లేని బస్సులపై కఠిన చర్యలు

విద్యా సంస్థలు పునఃప్రారంభ మ వ్వుతున్న  నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలను సీజ్ చేసి, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫిట్లెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపైకి రావొద్దు. ఒకవేళ వస్తే వాటిని సీజ్చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

  డాక్టర్ ఎన్ . వాణి  డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్