08-10-2025 12:57:02 AM
-జడ్పీ చైర్మన్ లలితనేనా?
-ఆసక్తిగా జడ్పీ చైర్మన్ పీఠం
-ముందంజలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత
-వ్యూహ రచనలో కాంగ్రెస్..
-సామాజిక బలంపై గురి
నిజామాబాద్, అక్టోబర్ 7(విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగక ముందే నిజామాబాద్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ఒడి దొడుకుల ను చవిచూసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఇప్పుడు ఈ కీలక పదవిపై తన దృష్టిని కేంద్రీకరించారు. ఇది ఆమె రాజకీయ పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేస్తుందా? లేక పార్టీలో కొత్త అంతర్గత పోరుకు దారితీస్తుందా? అన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అనుభవం, సామాజిక వర్గమే బలం:
మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, మండల పరిషత్ అధ్యక్షురాలు, రెండుసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా ఉన్నత స్థాయికి ఎదిగిన ఆకుల లలిత, జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. జిల్లాలో రాజకీయంగా, సంఖ్యాపరంగా బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఆమెకు అతిపెద్ద బలం. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న ఇతర బీసీ మహిళా నేతలతో పోలిస్తే, ఆమెకున్న రాజకీయ పరిణితి, ఆర్థిక పరిపుష్టి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిచయాలు ఆమెను పదవి రేసులో ముందు నిలుపు తున్నాయి. ‘జిల్లాలో అనేకమంది బీసీ మహిళా నేతలు ఉన్నప్పటికీ, జడ్పీ వంటి కీలక వ్యవస్థను నడిపించగల అనుభవజ్ఞుల కొరత ఉంది.
ప్రజలు గుర్తించే స్థాయిలో ఎవరు లేరు. ఈ నేపథ్యంలో విశేష రాజకీయ అనుభవం, జిల్లా ప్రజల్లో గుర్తింపు ఉన్న ఆకుల లలితను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే, ఆమె రాజకీయ నేపథ్యం పార్టీకి వ్యూహాత్మకంగా కలిసొస్తుంది‘ అని ఆమె మద్దతుదారులు బలంగా వాదిస్తున్నారు. జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన మున్నూరు కాపుల ఓట్లు ‘హస్త‘గతం చేసుకోవచ్చు అంటున్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఆకుల లలిత భర్త ఆకుల రాఘవేందర్ పరిచయాలు సైతం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని చెబుతున్నా రు. రాజకీయ, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీలకు 42 శాతం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో, బీసీ వాదం అత్యంత బలంగా ఉన్న నిజామాబాద్ జడ్పీపీఠం, స్వతహ బీసీవాది, మాజీ ఎమ్మెల్యే అయిన ఆకుల లలితకు ఇవ్వడం సముచితమని బీసీ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఎంపీగా అరవింద్ గెలవడం లో బీసీల పాత్రనే కీలకమని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ వైపు ఉన్న బీసీ ఓటు బ్యాంకును కొల్ల గొట్టాలంటే, ఆకుల లలిత నే సరైన జడ్పీ చైర్మన్ అభ్యర్థి అని విశ్లేషిస్తున్నారు. బీసీ కుల సంఘాలతో ఆమెకు ఉన్న అనుబంధం, మున్నూరు కాపుల్లో ఆకుల కుటుంబ ప్రాబల్యం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. పీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్న, జిల్లా ప్రజా ప్రతినిధి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం స్వంత జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వంపై లోతుగా ఆలోచించాలని అంటున్నారు. ఆయనకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదని, జిల్లా రాజకీయ నేపథ్యం అంతా తెలుసని చెబుతున్నారు.
రాజకీయ చదరంగంలో:
ఒకప్పుడు రాజకీయ గాడ్ ఫాదర్ డి.శ్రీనివాస్ (డీఎస్) శిష్యురాలి గా రాజకీయాల్లోకి ప్రవేశించి, అనతికాలంలోనే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిన చరిత్ర ఆమెది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక నేతగా ఎదిగిన లలిత, ఆయన మరణానంతరం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్‌ఎస్ లో చేరారు. అయితే, అక్కడ ఆమె ఆశించిన ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఘర్ వాపసీ‘ లో భాగంగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ, గతంలో ఉన్న ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి ఆమె వర్గంలో ఉంది. ఈ క్రమంలో, జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ద్వారా పార్టీలో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ లెక్కలు.. అధిష్టానం అండ?
నిజామాబాద్ జిల్లాలోని 31 జడ్పీటీసీ స్థానాల్లో మెజారిటీ మార్కు అయిన 17 స్థానాలను కైవసం చేసుకుంటేనే కాంగ్రెస్ జడ్పీ పీఠాన్ని అధిరోహించ గలదు. ఆకుల లలిత వంటి బలమైన, సీనియర్ నేతను చైర్మన్ అభ్యర్థిగా ముందుంచి ఎన్నికలకు వెళితే, అది కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంద ని ఒక వర్గం భావిస్తోంది. ఇప్పటికే ఆమె మద్దతుదారులు, జిల్లాకు చెందిన కీలక నేతల ద్వారా పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లినట్లు సమాచారం. అధిష్టానం కూడా ఆమె అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా, జడ్పీ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించా లనేది కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది.
తుది అంకంలో:
ప్రస్తుతానికి, ఆకుల లలిత అభ్యర్థిత్వం బలంగా వినిపిస్తున్నప్పటి కీ, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, పార్టీలో ఇతర ఆశావహుల స్పందన, రాజకీయ సమీకరణాలు తుది ఫలితాన్ని నిర్దేశిస్తాయి. తన రాజకీయ చతురతతో జడ్పీ పీఠాన్ని అధిరోహించి ఆకుల లలిత తిరిగి తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంటారో, లేక కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త ముఖానికి అవకాశం దక్కుతుందో తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఏదేమైనా, రాబోయే నిజామాబాద్ జడ్పీ చైర్మన్ ఎన్నిక జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టంగా నిలవనుంది.