08-10-2025 01:09:23 AM
వానాకాలం ధాన్యం దిగుబడి అంచనా
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 148.30 లక్షల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఇంత దిగుబడి ఎక్కడా నమోదు కాలేదని,దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృషించబోతున్నట్లు మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ మంగళవారం పౌర సరఫరాల శాఖ కార్యాలయం లో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల విస్తరణతో తెలంగాణ రాష్ర్టం సాధించిన వృద్ధి ధాన్యం దిగుబడిలో ప్రస్పుటమవుతుందన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 67.57 లక్షల ఎక రాల్లో జరిగిన వరి సాగులో 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరిని సాగు చేశారన్నారు.
ఇందులో సన్నాలు 90.46 లక్షల టన్నులు, దొడ్డు రకం 57.84 లక్షల టన్నులు మొత్తం కలిపి 148.30 లక్షల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి వివరించారు. కొనుగోళ్లలోను రాష్ర్టం దేశానికి మార్గదర్శనంగా నిలుస్తోందన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. కనిష్ట మద్దతు ధర కింద కొనుగోలు మొత్తానికి రూ. 21,112 కోట్ల అవుతుందని, ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద రూ. 19,112 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిమిత్తం చెల్లించాల్సిన రూ. 6,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. వరి క్వింటాకు అందించే 500 రూపాయల బోనస్‌ను ఇస్తామని ప్రస్తుత వానాకాలం, యాసంగి పంటలకు రైతులకు బోనస్ చెల్లింపులకుగాను రూ. 3,159 కోట్లు అవసరం ఉంటుందని చెప్పారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు గిడ్డంగుల కొరత ఉందని, ఎఫ్‌సీఐ అధ్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల టన్నుల సామర్థ్యం ఉండగా ఇప్పటికే 21.72 లక్షల టన్నుల ధాన్యం నిలువలతో అవి నిండి పోయాయని తెలిపారు. కేవలం 0.89 లక్షల టన్నుల ధాన్యం నిలువ ఉంచేందుకు మాత్రమే ఖాళీగా ఉందన్నారు.
ప్రస్తుతం 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయక పోవడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో అవి పేరుకపోయాయన్నారు. 2019--20లో 72 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2025 -26 నాటికి ఏకంగా 148.30 లక్షల టన్నుల దిగుబడికి చేరిందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఎఫ్‌సీఐతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు రూపొందిం చాలన్నారు.