08-10-2025 01:24:14 AM
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ ప్రజాపాలన అంతా మోసాల మయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 22 నెలల్లో ఆ పార్టీ చేసిన మో సం రాష్ర్ట ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందని తెలిపారు. కేటీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.
గత శాసనసభ ఎన్నికల్లో రాష్ర్ట మంతటా ఒకలా ఫలితాలు వస్తే, హైదరాబాద్‌లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా, బీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ల కడుపు మీద కొట్టిందో చెప్తారన్నారు. జూబ్లీహిల్స్‌లో మళ్లీ తిరిగి తమ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో శ్మశాన వాటిక విషయంలో కాంగ్రెస్ మేం ఇచ్చామంటుందని, కానీ 125 ఎకరాల చొప్పున ముస్లింలు, క్రిస్టియన్లకు శ్మశాన వాటికల కోసం 2022 లోనే బీఆర్‌ఎస్ స్థలాన్ని కేటాయించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 2,500 గజాలు ఇచ్చి మేమేదో చేసినాము అని చెప్పుకుంటే అది సిగ్గుచేటన్నారు.
ఆర్టీసీ ప్రైవేట్ పరం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించా రు. ఈవీ బస్సుల పేరుతో రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు పేరుతో భార్యకి ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకి డబుల్ రేటు, పిల్లల బస్ పాస్‌ల చార్జీలు పెంచడమనేది దారుణమన్నారు. ఒక్కో కుటుంబం మీద గతం కంటే 20 శాతం ఎక్కువ భారం పడుతోందని, ఇది రేవంత్ రెడ్డి ఇన్నోవేటివ్ థింకింగ్ అని ఎద్దేవా చేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజల కోపం ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని, దాన్ని తప్పకుండా కాంగ్రెస్ అనుభవిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
ఓట్ చోరీ కంటే పెద్ద నేరం?
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేత ఓటరు కార్డులు పంపిణీ చేయడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నిక టికెట్ ఆశావహుడు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్‌కార్డులను పంపిణీ చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తమ శాఖ బాధ్యతలు అప్పగించిందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెపుతున్న ఓట్‌చోరీ కంటే ఇది పెద్ద నేరం కాదా? అని కేటీఆర్ నిలదీశారు.