calender_icon.png 24 May, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీపర్లే లైబ్రేరియన్లు?

24-05-2025 01:35:21 AM

-అద్వాన్న స్థితిలో గ్రంథాలయాలు

మహబూబాబాద్, మే 23 (విజయ క్రాంతి): విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రంథాలయ నిర్వహణకు గ్రంథ పాలకుల (లైబ్రేరియన్లు)ను నియమించకపోవడంతో దినసరి వేతనంతో పనిచేసే స్వీపర్లు గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న దుస్థితి దాపురించింది.

మహబూబా బాద్ జిల్లాలో 1 జిల్లా గ్రంథాలయం, రెండు గ్రామ గ్రంథాలయాలు, 11 శాఖ గ్రంథాలయాలు వెరసి 14 గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో గ్రంధాలయాన్ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వ్యవహరించిన గుడిపూడి నవీన్ రావు కృషితో 2.70 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అన్ని  హంగులతో సరికొత్త భవనాన్ని నిర్మించి జిల్లాకే తల మానికంగా ఏర్పాటు చేశారు.

ఇక జిల్లాలోని తొర్రూరు, దంతాలపల్లి, డోర్నకల్, గార్ల, ఇనుగుర్తి, మరిపెడ, బయ్యారం, కొత్తగూడ మండలాల్లో శాఖ గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. నెల్లికుదురు, కేసముద్రం, రాజోలు, కురవి గ్రంధాలయాలకు వసతి సరిగా లేదు. సొంతభవనాలు ఉన్న గ్రంథాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకొని పాఠకులకు అసౌకర్యంగా మారాయి. ప్రతి ఏటా కొన్ని పుస్తకాలు పంపడం, పత్రికలు వేయించడానికి బిల్లులు చెల్లించి చేతులు దులుపుకోవడం తప్ప గ్రంథాలయాల పటిష్ట నిర్వహణకు చర్యలు తీసుకునే వారే లేరని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోటీ పరీక్షల నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలను, గ్రంథాలయంలో వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిలో ఉన్న పుస్తకాలు, పత్రికలతోనే విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థులు, యువత కుస్తీ పడుతున్నారు. పలుచోట్ల గ్రంథాలయాల భవనాలు శిథిలావస్థకు చేరి వర్షానికి కురుస్తుండడంతో పుస్తకాలు తడిసిపోవడంతో పాటు, చెదలు పట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా కేంద్రంలో అమోఘం.. మండల కేంద్రాల్లో అధ్వానం..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయం 2.70 కోట్ల రూపాయల వ్యయంతో గత ప్రభుత్వ హాయంలో కొత్తది నిర్మించి అన్ని హంగులతో ఏర్పాటు చేయడంతో అమోఘంగా మారింది. ఇదే క్రమంలో జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాల్లో ఉన్న గ్రంథాలయాలను పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు. ఫలితంగా 13 గ్రంథాలయాలు అసౌకర్యాల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఫర్నిచర్ ఉన్నప్పటికీ గది ఇరుకుగా మారడం, ఇంకొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో పాఠకులకు అసౌకర్యంగా మారాయి. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న గ్రంథాలయాల పరిస్థితి మరింత అద్వానంగా మారింది. 

గ్రంథాలయాలకు ‘పన్ను’ చెల్లించని పంచాయతీలు

గ్రామాల్లో ప్రజల నుంచి ప్రత్యేక పంచాయతీలు ఇంటి పన్ను వసూలు చేస్తున్న సందర్భంగా గ్రంథాలయ పన్ను కూడా వసూలు చేస్తున్నాయి. ఇలా ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పనులు 8 శాతం గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పంచాయతీలు గ్రంథాలయ సంస్థకు సక్రమంగా పన్ను చెల్లించడం లేదని చెబుతున్నారు. గ్రామ పంచాయతీలు ప్రజల నుంచి వసూలు చేసే గ్రంథాలయ పన్ను సక్రమంగా సంస్థకు చెల్లిస్తే గ్రంథాలయాల నిర్వాణకు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రతినెల క్రమం తప్పకుండా వేతన చెల్లింపుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. 

అర్హత ఉన్నా పదోన్నతుల్లేవు

ఏళ్ల తరబడి భవిష్యత్తుపై ఆశలతో స్వీపర్లుగా గ్రంథాలయాల్లో విధులు నిర్వహిస్తున్న చాలామంది లైబ్రేరియన్, సహాయకుడిగా నియమించడానికి అవసరమైన అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారి కూలీ కెళ్తే 500 రూపాయలు లభిస్తుండగా కేవలం 100 రూపాయలు కూడా రోజువారి కూలీ లభించని విధంగా ఉన్న స్వీపర్ పోస్ట్ లో భవిష్యత్తుపై ఆశలతో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్రంథాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో నియమించాలని కోరుతున్నారు.

మూడు తరాలుగా స్వీపర్లే! 

ఈ చిత్రంలో ఓపక్క చీపురుతో ఊడుస్తూ, మరోవైపు లైబ్రరీలో పుస్తకాలను సర్దుతున్న వ్యక్తి పేరు కూడా ఎండి బాబా. ఈయన తండ్రి గఫూర్ 28 ఏళ్ల పాటు కేసముద్రం గ్రంథాలయ స్వీపర్ గా విధులు 8ఏళ్ల క్రితం మరణించాడు. అంతకు ముందు గఫూర్ తండ్రి మైబెల్లి కూడా కొంతకాలం లైబ్రరీలో స్వీపర్ గా పనిచేశారు. ఇలా 1978 నుంచి ఇప్పటి వరకు తాత, తర్వాత తండ్రి, ఆ తర్వాత కుమారుడు మూడు తరాలుగా లైబ్రరీనే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నా వారి జీవితాల్లో మాత్రం ఎదుగుబోదుగులేదు.

కేవలం నెలకు 2,100 రూపాయలతో కుటుంబాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి. బాబా స్వీపర్ గా విధులు నిర్వహిస్తూనే గ్రంథాలయం పై ఉన్న మమకారంతో లైబ్రేరియన్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అయినప్పటికీ అతనికి గ్రంథ పాలకుడిగా ఉద్యోగం అందని ద్రాక్ష గానే మారింది. ఇక జిల్లావ్యాప్తంగా 14 గ్రంథాలయాలు ఉండగా ఇద్దరు రెగ్యులర్, మరో ఇద్దరు ఔట్సోర్సింగ్ విధానంలో లైబ్రేరియన్లు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 10 గ్రంథాలయాల్లో స్వీపర్లే గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇద్దరు రెగ్యులర్, ఇద్దరు ఔట్సోర్సింగ్ లైబ్రేరియన్లు తాము పని చేస్తున్న గ్రంధాలయాలతో పాటు ఇతర గ్రంథాలయాలకు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీనితో తాము పనిచేసే గ్రంథాలయాల్లో ఒకరోజు, ఇన్చార్జి ఇచ్చిన గ్రంథాలయాల్లో ఇతర రోజులు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుండగా, ఇతర రోజుల్లో పూర్తిగా స్వీపర్లే గ్రంథాలయాల నిర్వహణ బాధ్యతలను తలకెత్తుకుంటున్నారు. అర్హులైన వారికి పదోన్నతి కల్పించడం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు అంశాలను ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.