10-01-2026 01:08:01 AM
నాడు హెచ్‌సీయూ భూములు.. నేడు ఉర్దూ వర్సిటీ భూములు!
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో యూనివర్సిటీ భూములపై ప్రభుత్వ వైఖరిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. యూనివర్సిటీలకు చెందిన విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసిందన్న ఆరోపణలు రోజురోజుకు బలపడుతున్నాయి. గతం లో హైకోర్టు నిర్మాణం పేరుతో వ్యవసాయ యూనివర్సిటీ భూములను వినియోగించడమే కాకుండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయన్న అంశాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
తాజాగా ఉర్దూ యూనివర్సిటీ భూములపై కూడా ప్రభుత్వం కన్నేసిందన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతు న్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల భూములను లక్ష్యంగా మార్చుకుందన్న విమర్శలు బలపడుతున్నాయి. విద్య, పరిశోధన, భవిష్యత్ విస్త రణ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాల పేరుతో వినియోగించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమని విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
దీంతో రాష్ట్రంలో యూని వర్సిటీ భూములపై ప్రభుత్వ వైఖరి మరోసారి తీవ్ర వివాదానికి దారి తీయడమే కాకుండా తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ, హెచ్‌సీయూ, ఉర్దూ యూనివర్సిటీ తర్వాత టార్గెట్ ఉస్మానియా యూనివర్సిటీనా? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర అవసరాల పేరుతో యూనివర్సిటీలకు కేటాయించిన భూములను వేరే ప్రయోజనాలకు వినియోగించడం పునరావృతమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివాదాస్పద నిర్ణయాలు..
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు గతంలో వేల ఎకరాల్లో భూములు కేటాయించారు. హాస్టళ్లు, ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలు, కొత్త కోర్సుల విస్తరణ కోసం ఈ భూములు కీలకంగా ఉంటాయని అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఆ భూములను ఖాళీగా ఉన్నాయి, వాడకంలో లేవు అంటూ ప్రభుత్వ ప్రాజెక్టులు, వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని యూనివర్సిటీల పాలక మండళ్ల ఆమోదం లేకుండానే భూముల వినియోగంపై నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇది యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే అంశమని అధ్యాపక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యూనివర్సిటీ భూ ములు ప్రభుత్వ ఆస్తులు కాదని, ప్రజల వి ద్య కోసం కేటాయించిన ఆస్తులు అన్న వాదన వినిపిస్తోంది. అయితే భూముల వినియోగం వల్ల యూనివర్సిటీలకు నష్టం జరగ దని, ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
కానీ యూనివర్సిటీ భూములు తగ్గితే భవిష్యత్తులో కొత్త కోర్సుల ప్రారంభం, పరిశోధన విస్తరణ, విద్యార్థుల వసతుల కల్పన, అన్నీ దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది రాష్ట్ర ఉన్నత విద్య వ్యవస్థను బలహీనపరుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశం రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. యూనివర్సిటీ భూములను ప్రభు త్వం అక్రమంగా గుంజుకుంటున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపి స్తున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను కూడా వివిధ ప్రభుత్వ అవసరాల పేరుతో తీసుకునేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయ న్న ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ భూములు ప్రభుత్వ భూములే అన్న వాదనతో ముందుకెళ్లిన నిర్ణయాలు, విద్యార్థులు ఆందోళనలకు దారి తీశాయి. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి, విద్యా హక్కులపై ఈ ప్రయత్నాలు తీవ్ర ప్రభావం చూపాయన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో ఉర్దూ యూనివర్సిటీ చేరడం గమనార్హం.
ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను ఇతర ప్రభుత్వ అవసరాల కో సం వినియోగించాలన్న ఆలోచనలు సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి రావడంతో విద్యావర్గాల్లో ఆందోళన నెలకొంది. మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమైన ఈ యూనివర్సిటీ భూములను తగ్గించడం సమాజంలోని బలహీన వర్గాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
తర్వాత ఉస్మానియా వర్సిటీనేనా?
తాజాగా ఉర్దూ యూనివర్సిటీ భూములపై చర్చ మొదలవ్వగానే రాష్ట్రంలో అతిపెద్ద, చారిత్రకమైన ఉస్మానియా యూనివర్సిటీ భవితవ్యంపై విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర విస్తరణ, ప్రభుత్వ ప్రాజెక్టుల ఒత్తిడి నేపథ్యంలో ఓయూ భూములపై కూడా ఎప్పుడైనా నిర్ణయాలు వస్తాయా? అన్న భయం నెలకొంది. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా భూముల ప్రస్తావన తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తుంది.
ఉస్మానియా అంటే కేవలం భూమి కాదని, ఉస్మానియా యూనివర్సిటీ భూములు కేవలం రియల్ ఎస్టేట్ కాదని, లక్షలాది విద్యార్థుల విద్యా హక్కులు, తెలంగాణ సామాజికరాజకీయ చరిత్రలో కీలక అధ్యాయం అని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. ఇలాంటి యూనివర్సిటీ భూములపై ఆలోచన కూడా చేయడం విద్యా భవిష్యత్‌తో ఆటలాడడమేనని అభిప్రాయపడుతున్నారు.
యూనివర్సిటీ భూములపై వరుస వివాదాలు రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యమా, లేక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రాధాన్యమా అనే ప్రశ్న వినిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ వరకూ ఈ వివాదం చేరితే అది కేవలం భూముల విషయం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.