calender_icon.png 10 January, 2026 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు అండగా సీమిత్ర

10-01-2026 01:31:34 AM

  1. అందుబాటులో వర్చువల్ హెల్స్‌డెస్క్ విధానం
  2. ఇక ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్ 
  3. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పనిలేదు
  4. హైదరాబాద్ పోలీసుల విప్లవాత్మక నిర్ణయం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9(విజయక్రాంతి): సైబర్ నేరాల బాధితులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. మోసపోయామన్న బాధలో ఉన్న బాధితులు ఫిర్యాదు కోసం ఇకపై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు సీ-మిత్ర పేరుతో ఒక వినూత్న వర్చువల్ హెల్ప్‌డెస్క్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చా రు. సాంకేతికతను జోడించి ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యే వరకూ ప్రక్రియ మొత్తాన్ని ఇంటి నుంచే పూర్తి చేసేలా ఈ వ్యవస్థను రూపకల్పన చేశారు.

శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో   పోలీస్ అధికారులు వివరాలను వెల్లడించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు సాధారణంగా 1930 నంబర్కు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తారు. అయితే, ఆ ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్ గా మార్చాలంటే మాత్రం బాధితుడు కచ్చితంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చేది.

ఈ క్రమంలో బాధితులు పడే ఇబ్బందులను గమనించిన హైదరాబాద్ పోలీసులు, సీ-మిత్ర ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టారు. ఇకపై బాధితుడు 1930కి కాల్ చేస్తే చాలు.. సీ-మిత్ర బృందంలోని వర్చువల్ పోలీస్ ఆఫీసర్ స్వయంగా బాధితుడికి కాల్ చేసి వివరాలు సేకరిస్తారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌తో డ్రాఫ్టింగ్..

చాలామందికి ఫిర్యాదు ఎలా రాయాలో తెలియదు. ఈ సమస్య పరిష్కారానికి సీ-మిత్ర బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటుంది. బాధితుడు చెప్పిన వివరాలతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి, దానిని బాధితుడికి పంపిస్తారు. బాధితులు ఆ డ్రాఫ్ట్ను ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిస్తే సరిపోతుంది.

ఆ కాపీ అందిన వెంటనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాల ను ఎస్‌ఎంఎస్ ద్వారా బాధితుడికి పంపిస్తారు. ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ సీపీ క్రైమ్స్ ఎం. శ్రీనివాసులు, డీసీపీ సైబర్ క్రైమ్ ఏ. అరవింద్ బా బు, ఏసీపీ శివమారుతి తదితర అధికారుల బృందాన్ని సీపీ అభినందించారు.