calender_icon.png 10 January, 2026 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్థాపంతో ఇంటర్ విద్యార్థిని మృతి

10-01-2026 01:37:51 AM

  1. తోటి విద్యార్థుల ముందు అవమానించిన అధ్యాపకులు 
  2. భరించలేకపోయిన బాధితురాలు
  3. మారేడుపల్లి జూనియర్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

సికింద్రాబాద్, జనవరి 9 ( విజయ క్రాంతి): కళాశాలకు అరగంట ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిని తోటి విద్యార్థుల ముందు అధ్యాపకురాలు తిట్టారని తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సికిందరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో చోటుచేసుకుంది. కాగా విద్యార్థిని మృతికి కారణమైన అధ్యాపకురాలిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి.

మారేడ్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు మారేడుపల్లిలోని డాక్టర్ మునగా రామ మోహన్ రావు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మల్కాజిగిరికి చెందిన గుడేటి నరసింహ, మాలతిల కుమార్తె వర్షిణి (16) ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. అక్క వైష్ణవి కూడా అదే కాలేజీలో చదువుతుంది. వర్షిణి గురు వారం కళాశాలకు 40నిముషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో తరగతి గదిలోనే లెక్చరర్లు శ్రీలక్ష్మీ, మధురై తోటి విద్యార్థుల ఎదుటే వర్షిణిను తీవ్రంగా మందలించారు.

తనకు శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ సదరు అధ్యాపకులు పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడ్డారు. ఆలస్యంగా పరీక్ష రాయడానికి కూడా అనుమతించకపోవడంతో ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది. ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో ఇంటివద్దనే స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెను మల్కాజిగిరి ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు. అప్పటికే విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయలేని స్థితికి చేరుకుంది. స్కానింగ్ చేసిన వైద్యులు తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్‌లో రక్తంగడ్డ కట్టిందని వెల్లడించారు. విద్యార్థిని పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి మృతి చెందింది.

వర్షిణి మృతికి నిరసనగా శుక్రవారం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు,ఎమ్మార్పీఎస్ నేతలు, ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మారెడుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.