05-01-2026 12:52:12 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగను సొం తూళ్లో జరుపుకునేందుకు నగరవాసులు, సెటిలర్లు పల్లె బాట పడుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా దొంగలు నిర్మానుష్యం గా మారే కాలనీలు, తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. కుటుంబంతో సహా ఊరికి వెళ్తున్నట్లయితే తప్పనిసరిగా మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో గానీ, లేదా స్థానిక బీట్ ఆఫీసర్‌కు గానీ సమాచారం అందించాలని సూచించారు.
పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతారని చెప్పారు. విలువైన వస్తువులను ఇళ్లలో వదిలి వెళ్లొద్దని, నగదు, బంగారం, వెండి ఆభరణాలను బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవడం ఉత్తమమని చెప్పారు. ఆస్తి పత్రాలు, బాండ్లు కూడా ఇంట్లో ఉంచకూడదన్నారు. పోలీసుల పెట్రోలింగ్‌తో పాటు ఇంటి యజమానులు తీసుకునే వ్యక్తిగత జాగ్రత్తలే దొంగతనాలను నివారిస్తాయని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.