calender_icon.png 23 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపాలికల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

23-01-2026 12:28:21 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జనవరి 22 (విజయక్రాంతి): త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్.ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధత పై సమీక్ష నిర్వహించారు. ఫోటో తో కూడిన ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్, రిటర్నింగ్ అధికారులు ఎంపిక, పోలింగ్ సిబ్బంది, తదితర అంశాల పై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా ముద్రణ జరిగే విధంగా చూడాలని సూచించారు.

నామినేషన్ సమయంలో వెబ్ క్యాస్టింగ్ లేదా వీడియో కవరేజీ చేయించాల్సిందిగా సూచించారు. కౌంటింగ్ కొరకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో జరగబోయే ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధి ఇప్పటికే ఫోటో తో కూడిన ఎలక్ట్రల్ రోల్ విడుదల చేయడం జరిగిందని, ప్రజల నుండి వచ్చిన దాదాపు 200 అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 80 వార్డులకు గాను 117441 ఓటర్లకు సరిపడా 191 పోలింగ్ కేంద్రాలను గుర్తించి మున్సిపల్ అధికారులు పరిశీలించి వాటిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రేపు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు.చేయడం జరిగిందని, పోలింగ్ సిబ్బంది వివరాలు ఇప్పటికే టి పోల్ లో నమోదు చేసినట్లు తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్లను గుర్తించి తగిన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డి.పి. ఒ రఘునాథ్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు వి.సి.లో పాల్గొన్నారు.