22-12-2025 09:49:22 PM
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11: ౩౦ గంటలకు అలంపూర్ లోని హరిత హోటల్ కు చేరుకుంటారన్నారు.
అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి 11:45 నిమిషాలకు చేరుకొని అక్కడ పూజల అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం గద్వాల ఐడిఓసి చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసే వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ పరిశీలిస్తారన్నారు. గద్వాల చేనేత చీరల ఖ్యాతి ప్రతిబింబించేలా మగ్గం, చేనేత జరీ చీరల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారిని ఆదేశించారు. వివిధ రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులతో గవర్నర్ సమావేశమై మాట్లాడుతారన్నారు.
ఈ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం అతిధులను ఆహ్వానించాలన్నారు. శానిటేషన్, వేదికల అలంకరణ, విద్యుత్ సరఫరా, తదితర ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గవర్నర్ పర్యటన సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తును నియమించినట్లు తెలిపారు. అలంపూర్ లోని హరిత హోటల్ వద్ద, గద్వాల ఐడిఓసి లో గవర్నర్ గౌరవార్ధం గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం ఉంటుందన్నారు.
జెడ్ ప్లస్ సెక్యూరిటీతోపాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు, జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, అలంపూర్ ఆలయ ఈవో దీప్తి, చేనేత, జౌళి శాఖ ఏడి గోవిందయ్య, డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, డివైఎస్ఓ కృష్ణయ్య, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.