28-01-2026 12:30:08 AM
హాజరు కానున్న ఐదు లక్షలకు పైగా భక్తులు
100 మంది పోలీసులతో బందోబస్తు
హనుమకొండ జిల్లా ముల్కనూరులో 44 ఏళ్లుగా జాతర
భీమదేవరపల్లి, జనవరి 27 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో గత 44 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని వసతులు పూర్తి చేసినట్లు సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య మంగళవారం తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత 44 సంవత్సరాల్లో జాతరలో ఎన్నడూ లేని విధంగా ముల్కనూర్ నరహరి తండాకు చెందిన మాలోత్ మొగిలి నాయక్ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీలో డైరెక్టర్‌గా అవకాశం కల్పించామన్నారు.
తనకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాలోత్ మొగిలి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 28న సారాలమ్మ గద్దెకు వచ్చుట, 29న సమ్మక్క గద్దెకు వచ్చుట,30న మొక్కుబడులు సమర్పణ, 31న వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారని సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, చైర్మన్ జక్కుల ఐలయ్య తెలిపారు. జాతరలో 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. సుమారు 5 లక్షలకు పైగా భక్తులు హాజరుకానున్నట్లు అంచనా వేశామని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
కాగా మంగళవారం భీమదేవరపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో వీరేశం, ముల్కనూర్ ఈవో జంగం పూర్ణచందర్‌ల సమక్షంలో తమ విధుల్లో చేరారు. సమావేశంలో డైరెక్టర్లు గీకురు ఐలయ్య, బావుపేట మాడుగుల యాదగిరి, గుడికందుల రాజు, పెంచికల జయపాల్, వంగ శ్రీను, కొదురుపాక శ్రీను, విజయ రెడ్డి, పెంట పూర్తి వీరారెడ్డి, మద్ది వేణు, మారుపాటి శ్రీనివాస్ రెడ్డి, మాడుగుల మధుకర్, ఎలుక పెళ్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.