calender_icon.png 28 January, 2026 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా జాతరను వైభవంగా జరుపుకోవాలి

28-01-2026 12:32:57 AM

ఆత్మగౌరవానికి ప్రతీకలుగా.. సమ్మక్క, సారలమ్మ 

మేడారం తల్లుల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం 

ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలి 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి 

అమెరికా నుంచి అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : తెలంగాణ కుంభమేళాగా పేరొంది న మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు.  చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించింది గుర్తు చేశారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించిందని, రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించినట్లు సీఎం తెలిపారు.  గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తు చేశారు. గిరిజన సంస్కతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాలను పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని సీఎం చెప్పారు. మేడారం తల్లుల స్ఫూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ర్టంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. 

జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్ట్రాభివద్ధికి పునరంకితమవుతామని, నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భక్తులు సహకరించాలని కోరారు. పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.