calender_icon.png 9 October, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

08-10-2025 10:05:41 PM

బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన బంగారు నగలు తిరిగి అప్పగింత..

హుస్నాబాద్: ప్రయాణికుల భద్రతతో పాటు వారి వస్తువుల పట్ల కూడా ఆర్టీసీ సిబ్బంది ఎంతటి బాధ్యతగా ఉంటారో నిరూపించే సంఘటన ఇది. బస్సులో ఓ ప్రయాణికురాలు మరచిపోయిన నాలుగు తులాల బంగారం, బట్టలు ఉన్న బ్యాగును ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తతతో సురక్షితంగా అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే బుధవారం హనుమకొండకు చెందిన శోభారాణి సిద్దిపేట నుంచి హనుమకొండకు సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో ప్రయాణించారు. హనుమకొండలోని పెట్రోల్ బంకు వద్ద ఆమె దిగిన అనంతరం తన బ్యాగును బస్సులో మరచిపోయినట్టు గమనించారు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారం, విలువైన బట్టలు ఉన్నాయి. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు తక్షణమే ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు సమయాన్ని వృథా చేయకుండా చర్యలు చేపట్టారు.

బస్సు డ్రైవర్ మల్లయ్య, కండక్టర్ శంకర్లకు సమాచారం అందించగా, వారు బస్సును తనిఖీ చేశారు. చివరకు, బస్సు హుస్నాబాద్ బస్టాండ్‌కు చేరుకోగానే, ఆర్టీసీ సిబ్బంది బ్యాగును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ బస్టాండ్ కంట్రోలర్ లకావత్ హరి, సెక్యూరిటీ సిబ్బంది లకావత్ వెంకటేశ్, మహేందర్ వెంటనే మహిళా ప్రయాణికురాలికి సమాచారం అందించారు. బ్యాగును తిరిగి హుస్నాబాద్ బస్టాండ్‌కు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరారు. తమ విలువైన వస్తువులు సురక్షితంగా ఉన్నాయని తెలుసుకున్న శోభారాణి, హుస్నాబాద్ బస్టాండ్‌కు వచ్చి, ఆర్టీసీ సిబ్బంది సమక్షంలో తన బ్యాగును తీసుకున్నారు. చిత్తశుద్ధి, నిజాయితీ ప్రదర్శించిన ఆర్టీసీ సిబ్బందికి, తక్షణమే స్పందించి సహకరించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల పట్ల ఆర్టీసీ సిబ్బంది ఇలాగే చిత్తశుద్ధి, నిజాయితీతో ఉంటే సంస్థ పట్ల ప్రయాణికులకు మరింత నమ్మకం పెరుగుతుంది.