26 June, 2026 | 8:18 PM

భూతగాదాలో నిందితుల అరెస్టు

14-06-2024 01:19 AM
  1. హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు
  2. నిందితుల్లో బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు 

సిద్దిపేట, జూన్ 13 (విజయక్రాంతి): తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నిందితులపై హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించే ముందు సిద్దిపేట వన్‌టౌన్ సీఐ లక్ష్మీబాబుతో కలిసి ఏసీపీ మధు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట రాఘవేంద్ర నగర్‌లోని 1999 సర్వే నంబర్‌లో 2023 సంవత్సరంలో గిరికముక్క రాజేశ్ అనే వ్యక్తి ప్లాట్ కొనుగొలు చేసి మున్సిపల్ శాఖ అనుమతులతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టగా.. దూది శ్రీకాంత్ రెడ్డి (బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు), పత్రి శ్రీనివాస్ (బీజేపీ పట్టణ అధ్యక్షుడు) అనే ఇద్దరు ఆ ప్లాట్ తమదంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.

పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను నిలిపేశారు. బాధితుడు రాజేశ్ కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. దీంతో రాజేశ్‌ను, అతడికి సహకరిస్తున్న సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులను చంపేస్తే ఆ ప్లాట్ తమకు దక్కుతుందని శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. మరికొందరితో కలిసి ఏప్రిల్ 19న రాత్రి నిర్మాణ పనులు జరుగుతుండగా జేసీబీతో వెళ్లి నిర్మాణాలను కూల్చివేసి.. రాజేశ్, సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలపై దాడి చేశారు. అక్కడున్న కార్లను, బైక్‌లను ధ్వంసం చేశారు. దీంతో బాధితులు 108కి సమాచారం ఇవ్వడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నెల 9న నిందితుల్లో కొందరైన అలకుంట ఆనంద్, వల్లేపు పర్శరాములు, 11న బొళ్లావేణి యాదగిరినిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రధాన నిందితులైన దూది శ్రీకాంత్ రెడ్డి, పత్రి శ్రీనివాస్, పాతూరి శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి నగేశ్, చేర్యాల అభిషేక్ గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ మధు వెల్లడించారు.