24-01-2026 08:42:40 PM
ఘట్‌కేసర్: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఘట్‌కేసర్ బస్టాండ్ ఆవరణలో శనివారం ఘట్‌కేసర్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ‘అర్రివ్ అలైవ్ – డ్రైవర్స్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి మాట్లాడుతూ.... నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
వేగ నియంత్రణ పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. డిపో మేనేజర్ కె. కవిత మాట్లాడుతూ ప్రజా రవాణా డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలకు రక్షకులని పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేయాటంతో పాటు వారికీ గులాబీ పువ్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ‘అర్రివ్ అలైవ్’ నినాదాన్ని పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈసందర్బంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రభాకర్ రెడ్ది, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు, అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.