24-01-2026 08:46:02 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యా సహకారం అందిస్తున్న అక్షరమాల సంస్థ 5వ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలో అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో విశేష సేవలందించినందుకు, అలాగే మాస్టర్ మైండ్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నిరంతర సహకారం అందించిన జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
అక్షరదాన్, ఐఐటీ హైదరాబాద్, ఎస్‌సీఈఆర్‌టీ తెలంగాణ సంయుక్తంగా చేపట్టిన అక్షరమాల కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులకు అందించిన సహకారం ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అక్షరమాల చైర్మన్ డా. ఎంఎస్‌ఆర్ మూర్తి చేతుల మీదుగా కటుకం మధుకర్‌కు ‘బెస్ట్ సర్వీస్ అవార్డు’ ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి హాజరై మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
అక్షరమాల చైర్మన్ డాక్టర్ ఏ.ఎన్.ఆర్ మూర్తి మాట్లాడుతూ... జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్స్ కార్యక్రమం ద్వారా గత ఐదు సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు గూగుల్ మీట్ ద్వారా అందిస్తున్న శిక్షణ వల్ల విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకునే మార్గం సులభమైందని తెలిపారు.