24-01-2026 04:12:28 PM
- ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత:
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
- రోడ్డు భద్రతే లక్ష్యంగా సిరిసిల్ల పట్టణంలో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన“అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు, విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ప్రజలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
మనం నిబంధనలు పాటించినప్పటికీ, ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశముందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలు రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణాల రక్షణ లక్ష్యంగా ప్రారంభించిన “అరైవ్–అలైవ్” కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం,పట్టణం, కాలనీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా కొనసాగుతుందని తెలిపారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం వాహనాలకు రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్లు అట్టించి అధికారులు,వాహనదారులతో కలసి ఎస్పీ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కృష్ణ, ఆర్.ఐ సురేష్, ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ దిలీప్ సిబ్బంది,నేతాజీ డిగ్రీ కలశాల విద్యార్థులు పాల్గొన్నారు.