24-01-2026 05:16:07 PM
- రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమే
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద ప్రమాదాలు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో వేములవాడలో అరైవ్.. అలైవ్.. అలెర్ట్, రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం
2కే వాకథాన్, ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వాహనదారుల సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్బంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో వేములవాడ పట్టణంలో అరైవ్.. అలైవ్.. అలెర్ట్, రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2కే వాకథాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం పై విద్యార్థులు డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్.. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో జరిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. 2కే వాకథాన్ ను ప్రభుత్వ విప్, చొప్పదండి ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ జెండా ప్రారంభించారు. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి చౌరస్తా నుంచి కోర్ట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మైదానం వరకు ముఖ్య అతిథులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు ఆలోచన వచ్చిన వెంటనే వివిధ చర్యలను ఆచరణలో పెట్టిందని వెల్లడించారు. రోడ్డు పైకే వచ్చే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, దీంతో మీకు.. అలాగే రోడ్డుపై ప్రయాణించే మిగితా వాహనదారులు, రోడ్డు వెంట వెళ్ళే వారి రక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. మనిషి ప్రాణం చాలా విలువైనదని పేర్కొన్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే బాదిత కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, ఆ ఇబ్బందులు వర్ణనాతీతమని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఇబ్బంది పడుతున్నారని, వారితో కచ్చితంగా హెల్మెట్ ధరింపజేయాలని, ప్రమాదాల బారి నుంచి రక్షించాలనే సద్దుదేశంతో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ చేపట్టిన నో హెల్మెట్ ..నో పెట్రోల్ కార్యక్రమాన్ని అభినందించారు. పెట్రోల్ బంకు యజమానులు సామాజిక బాధ్యతగా హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ పోయవద్దని పిలుపునిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ఒక వేళ తాగితే వాహనాలపై ప్రయాణాలు చేయవద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు.
చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది..
రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, హెల్మెట్ లేకుండా ప్రయత్నం చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, వాటితో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక యుద్ధంలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో గత ఏడాది 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, దేశంలో గత ఏడాది 1, 70, 000 మంది చనిపోయారని గుర్తు చేసారు. ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎవరూ రోడ్డు ప్రమాదాల్లో బాధితులు కావద్దని స్పష్టం చేశారు.
వాహనదారులు అంశాలు పాటించాలి
రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు నో ఓవర్ స్పీడ్, నో డ్రంక్ అండ్ డ్రైవ్ నో హెల్మెట్.. నో డ్రైవ్.. నో ఫోన్.. నో డ్రైవ్.. నో ఓవర్ లోడు పాటించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ట్రాఫిక్ రూల్స్ మీ కోసం.. మీ కుటుంబం కోసం పాటించాలని పిలుపునిచ్చారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో ఇబ్బంది పడేది ద్విచక్రవాహన దారులేనని తెలిపారు. వారి సంరక్షణ కోసం నో హెల్మెట్-నో పెట్రోల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు. ఈ నెల మొత్తం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే మండేపల్లి డ్రైవింగ్ స్కూల్ ఆవరణలో వేములవాడలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని గుర్తు చేసారు.
రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖలతో రోడ్ సేఫ్టీ మీటింగ్ లు పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తిస్తూ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2024 సంవత్సరంలో 292, 2025 సంవత్సరంలో 262 ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. రోడ్డు ఆక్సిడెంట్ ఫ్రీ గా జిల్లాను చేద్దామని పేర్కొన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తీసువెళ్ళవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో బాదితులను గోల్డెన్ హావర్ (మొదటి గంటలో) దవాఖానకు తరలించి, ప్రాణాలు కాపాడే వారికీ రహవీర్ కింద రూ. 25 వేల ఆర్ధిక సహయం అందిస్తామని తెలిపారు.
రోడ్ సేఫ్టీ అంటే లైఫ్ సేఫ్టీ..
రోడ్ సేఫ్టీ అంటే లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. జిల్లలో గత ఏడాది 317 ఆక్సిడెంట్స్ 82 మంది చనిపోయారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతున్నాయని వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు దెబ్బ తగిలి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, ట్రిబుల్ రైడింగ్ చేయవద్దని, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మీ భద్రత.. మీ బాధ్యత అందరి రక్షణ అని తెలిపారు.
బోర్డర్ లో సైనికులకంటే ఎక్కువ..
ప్రతి ఏడాది మన దేశంలో బోర్డర్ లో సైనికుల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారని వేములవాడ ఏఎస్పీ ఐపీఎస్ రుత్విక్ సాయి తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే ద్వి చక్ర వాహనదారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని వివరించారు. రోడ్డు ప్రమాదాలు.. నియంత్రణ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ చూసిన విషయాలు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో చర్చించాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో పలు పంచుకోవాలని కోరారు.
ప్రమాదాలకు గురైన వాహనాల ప్రదర్శన
ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గురైన వాహనాలను ప్రదర్శనగా పెట్టారు. ఏ ఏ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగాయో వివరించారు. అలాగే రోడ్డు ప్రమదాలతో వీడిన పడిన కుటుంభ సబ్యులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా అందరితో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఐపీఎస్ రుత్విక్ సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మన్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.