21-05-2025 12:03:08 AM
మహబూబాబాద్, మే 20 (విజయ క్రాంతి): విద్యుత్ సరఫరాలో 24 గంటల పాటు నిరంతరాయంగా అనేక సంవత్సరాలుగా ‘వెలుగు’నిచ్చే విధులు నిర్వహిస్తున్న వేలాదిమంది ఆర్టిజన్లు, కట్టర్ల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి చాలీచాలని వేతనంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీజన్లు, కట్టర్లకు వేతన పెంపు, ఇతర సౌకర్యాల కల్పన, ప్రమోషన్లు అందని ద్రాక్ష గానే మారాయి.
దీనితో అడకత్తెరలో పోక చెక్కలా మారింది వారి పరిస్థితి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వహించే ఆర్టిజన్లకు పదోన్నతి ఆశని పాతంగా మారింది.
గత ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు కల్పించి అర్హతను బట్టి విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్, లైన్మెన్ పోస్టులను ఇస్తామని ప్రకటించినప్పటికి, తెర వెనుక జరిగిన తతంగంతో అర్ధంతరంగా 2018లో తీసుకొచ్చిన బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ కౌన్సిల్ ఉత్తరువుతో ప్రమోషన్లు ఇవ్వడం అటుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించకుండా లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18,226 మంది ఆర్టిజన్లు విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు.
వీరికి ప్రతి నెల అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని 34 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ పరిధిలో ఓ విధంగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో మరో విధంగా ఉత్తర్వులను అమలు చేయడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆర్టిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే ఆర్టిజన్లపై పని భారం అధికంగా మోపడంతో పాటు పవర్ ట్రాన్స్ ఫార్మర్ రేడియేషన్ వల్ల అనారోగ్యానికి గురై అర్ధాంతరంగా ‘తనువు’ చాలించాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్టిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏళ్ల తరబడి సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న తమ బతుకులు బాగుపడతాయని, సర్వీస్ రెగ్యులర్ అవుతుందని భావిస్తే స్వరాష్ట్రం సిద్ధించినా తమ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి’ అక్కడే అన్న చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లోనైన తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు.
ఆర్టిజన్ల తరహా లోనే విలేజ్ వర్కర్ల పరిస్థితి
గ్రామస్థాయిలో విద్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ (కట్టర్, అన్ మ్యాండ్ ) వర్కర్ల పరిస్థితి ఇదే తరహాలో ఉంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో వందలాదిమంది గ్రామస్థాయిలో విద్యుత్ సరఫరాల కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరికి కేవలం 16 వేల రూపాయలు అందులో 3000 రూపాయలు కటింగ్ అవుతుండగా 13 వేల రూపాయల వేతనంతో కాలం వెళ్ళదిస్తున్నారు.
గ్రామాల్లో నిరంతరం ఎక్కడో చోట విద్యుత్ సరఫరా కు అంతరాయం కలుగుతుండడం వల్ల వీరు పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం గా విధులు నిర్వహించాల్సి వస్తుంది. పగలు రాత్రి లేకుండా కష్టపడుతున్నప్పటికీ, కనీస వేతనం దక్కడం లేదని వాపోతున్నారు. విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే తమను పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు.
ప్రాణాలను పరంగా పెట్టి, భవిష్యత్తుపై ఆశతో విధులు నిర్వహిస్తున్న తమకు పదోన్నతి, ఎన్పీడీసీఎల్ లో ఖాళీలు ఏర్పడినప్పుడు అవకాశం కల్పించడకుండా మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో రెగ్యులర్ ఉద్యోగులకు మించి శ్రమిస్తున్నప్పటికీ వారికి ఇచ్చే వేతనంలో కనీసం పదో వంతు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎదుకు బొదుగు లేని ఉద్యోగం మాకెందుకని మధ్యలో వదిలి వెళ్ళి పోతున్నారు. ఇంత జరుగుతున్న విద్యుత్తు సంస్థల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారి పట్ల యాజమాన్యం కనికరం చూపడం లేదని వాపోతున్నారు.
స్టాండింగ్ కౌన్సిల్ ఆర్డర్ ఎత్తివేయాలి
ఒకే విధంగా విద్యుత్ సంస్థల్లో సేవలందిస్తున్న ఆర్టిజన్లు, విలేజ్ వర్కర్లకు శాపంగా మారిన స్టాండింగ్ కౌన్సిల్ ఆర్డర్ ఎత్తివేయాలి. ఒకే వ్యవస్థ, ఓకే విధానం అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లీవులు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు గ్రాడ్యుటి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. 15వేల రూపాయల పిఎఫ్ సీలింగ్ ఎత్తివేయాలి.
విధి నిర్వహణలో చనిపోతే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే పరిహారం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న ఆర్టిజన్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రతి సబ్ స్టేషన్ కు ముగ్గురికి తగ్గకుండా ఆర్టిజన్లను నియమించి పని భారం తగ్గించాలి. సీనియర్ ఆర్టిజన్లకు ప్రమోషన్లలో అవకాశం కల్పించాలి.
సికిందర్, ఆర్టిజన్ల యూనియన్ రాష్ట్ర నాయకుడు