21-05-2025 12:10:02 AM
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో చార్జీల విషయంలో ఎల్ అండ్ టీ సంస్థ దిగొచ్చింది. ఇటీవల పెంచిన చార్జీల్లో 10 శాతం తగ్గిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ధరలు వర్తించనున్నాయని ప్రకటించింది. ఇటీవలే మెట్రో కనీస చార్జీలు రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కు పెంచింది.
పెరిగిన చార్జీలపై ప్రయాణికుల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ సంస్థ చార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం కూడా చార్జీల విషయంలో ఆలోచించాలని ఎల్ అండ్ టీ సంస్థకు సూచించడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.