calender_icon.png 18 October, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధం వీడిన ఆశన్న

18-10-2025 12:57:26 AM

  1. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో లొంగుబాటు
  2. ములుగు జిల్లా నర్సింగాపూర్ ఆశన్న స్వస్థలం చంద్రబాబుపై అలిపిరి బ్లాస్ట్ వ్యూహకర్త?
  3. నాటి హోంమంత్రి మాధవరెడ్డి, ఐపీఎస్ ఉమేశ్‌చంద్ర హత్య వెనుక సూత్రధారి?
  4. ఆయనతో పాటు మరో 210 మంది పార్టీ సభ్యులు
  5. వీరిలో 110 మంది మహిళలే.. 153 ఆయుధాల అప్పగింత

రాయ్‌పూర్/హైదరాబాద్, అక్టోబర్ 17: మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 60 మంది పార్టీ సభ్యులతో కలిసి లొంగిపోయిన రెండు రోజుల వ్యవధిలోనే పార్టీకి చెందిన మరో అగ్రనేత ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

శుక్రవారం ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో ఆశన్నతోపాటు మరో 210 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో సీసీఎం స్థాయి సభ్యుడు ఒకరు, డీకేఎస్‌జెడ్‌సీ స్థాయి సభ్యులు నలుగురు, ప్రాంతీయ కమిటీ సభ్యుడు ఒకరు, డీవీ సీఎం స్థాయి సభ్యులు 22 మంది, ఏసీఎం స్థాయి సభ్యులు 61 మంది కాగా, సాధారణ సభ్యులు 99 మంది.

అలాగే లొంగిపోయిన మొత్తం సభ్యుల్లో 110 మంది మహిళా మావోయిస్టులు కాగా, 98 మంది పురుషులు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. 153 తుపాకులు అప్పగించగా, వాటిలో 19 ఏకే 47 రైఫిళ్లు, 17 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్‌లు, ఒక ఇన్సాస్ ఎల్‌ఎంజీ, 303 రైఫిళ్లు, 11 బీజీఎల్, నాలుగు కార్బున్లు, 41 బోర్ షాట్‌గన్లు, పిస్తోళ్లు ఉన్నాయి. కార్యక్రమంలో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిల్, హోం మంత్రి విజయ్‌శర్మ పాల్గొన్నారు.

ఐపీఎస్ ఉమేశ్‌చంద్ర, మంత్రి మాధవరెడ్డి హత్యల వెనుక..

ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ప్రస్తుత ములుగు జిల్లా వెంకటాపూర్(రామప్ప) మండలంలోని నర్సింగాపూర్. పాఠశాల విద్య లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశారు. హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యనభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ)లో చేరారు. 1991లో ఆయన 25 ఏళ్ల వయసులో పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరారు.

ఆ తర్వాత పదేళ్లలోనే ఆయనపై అప్పటి వరంగల్ జిల్లావ్యాప్తంగా 48 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మావోయిస్టు పార్టీలో ఆశన్నకు వ్యూహకర్తగా పేరున్నది. పార్టీ దండకారణ్య సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా ఆయన రూపేశ్ పేరుతో అనేక వ్యూహాలు రచించారని ఇంటెలిజెంట్ వర్గాలు భావిస్తున్నాయి.

1999లో ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్ర హత్య, 2000లో నాటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అలిపిరి వద్ద జరిగిన బ్లాస్టింగ్ వంటి ఎన్నో ఘటనలకు ఆశన్నే నేతృత్వం వహించినట్లు పోలీస్‌వర్గాలు చెప్తుంటాయి. ప్రస్తుతం ఆశన్న వయస్సు 60 ఏళ్ల వరకు ఉంటుంది. ఆయనపై అనేక కేసులున్నాయి. ఆయన తలపై రివార్డులూ ఉన్నాయి. 

చివరిసారి భావోద్వేగ ప్రసంగం

‘తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆయుధాలు వదిలిపెడుతున్నాం.. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం. ఇప్పుడు ఎవరికి వారే తమ రక్షణ కోసం పోరాటం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సహచరులందరూ ఎక్కడవాళ్లు అక్కడే లొంగిపోవడం మంచిది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం.

జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఉద్యమంలో  అమరులైన వారందరికీ జోహార్లు. ఇకపై మన పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగాలి. మనం సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చాం. ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేద్దాం’ అని ఆశన్న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లొంగిపోయే ముందు చివరిసారిగా తన సహచర మావోయిస్టులకు ఆయన భావోద్వేగ సందేశమిచ్చారు.

ఈ సందర్భంగా తాము పెట్టిన ప్రధాన షరతులపై ప్రభుత్వ స్పందన గురించి కూడా మాట్లాడారు. తాము పెట్టిన డిమాండ్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాయన్నారు. మాపార్టీ, అనుబంధ సంఘాల్లో పనిచేశారనే ఆరోపణలపై జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలని, మూలవాసీ బచావో మం సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశామన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ)లో చేరబోమని స్పష్టం చేశామని ఆయన వెల్లడించారు.

హింస వీడాలి: ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్

‘దేశ చరిత్రలోనే ఇది మంచిరోజు. కేవలం ఛత్తీస్‌గఢ్‌కే కాదు.. యావత్ దేశానికి చరిత్రాత్మకమైన రోజు. మావోయిస్టులు పార్టీ హింసాయుత మార్గాన్ని వీడాలి. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. లొంగిపోయిన వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది. వారిలో నైపుణ్య శిక్షణ ఇచ్చి, పునరావాసం కల్పిస్తాం’ అని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీ ఇచ్చారు.