18-10-2025 12:56:55 AM
-కిలోన్నర బంగారు ఆభరణాలు
-రూ.కోట్ల విలువైన ఆస్తిపత్రాలు.. రెండు ఖరీదైన కార్ల గుర్తింపు
-ఒక కేసు విషయంలో సోదా చేయగా.. అక్రమాస్తులు బట్టబయలు
చండీగఢ్, అక్టోబర్ 17: సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) ఓ కేసులో చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) అవినీతి బాగోతం బట్టబయలైంది. డీఐజీ ఇంట్లో సీబీఐ అధికారులకు లెక్కాపత్రం లేని రూ.5 కోట్ల నగదు, కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అలాగే రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, ఖరీదైన రెండు కార్లు, 22 ఖరీదైన గడియారాలు, ఒక డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్‌తో పాటు మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అవినీతి తిమింగలం అక్రమ సంపాదన వ్యవహారం దేశంలో సంచలనం సృష్టించింది. మండి గోబింద్‌గఢ్ పట్టణానికి చెందిన స్క్రాప్ వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో ఓ కేసు నమోదైంది. కేసును మాఫీ చేసేందుకు రోపర్ రేంజ్ డీఐజీ (2009 ఐపీఎస్ అధికారి) హర్‌చరణ్ భుల్లార్ రూ.8 లక్షల లంచంతోపాటు నెలవారీ మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు వ్యాపారి, డీఐజీ మధ్య కిషన్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడు. ఆకాశ్ ఇచ్చిన సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు డీఐజీ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. గురువారం ఈ మేరకు ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున కిషన్ రూ.8 లక్షల నగదు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. డీఐజీ, మధ్యవర్తి కిషన్, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని శుక్రవారం చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.